
ఓవైపు సౌత్‌లో సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీలోనూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది పూజాహెగ్డే. ‘కూలీ’చిత్రంలోని మోనికా పాటతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందామె. సినిమా చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ మోనికా పాటకు స్టెప్పులేస్తున్నారు. పాటను హమ్ చేస్తూ మోనికా..మోనికా అంటూ ఒప్పేస్తున్నారు. ఈ క్రమంలో మోనికా పాటకు వస్తున్న రెస్పాన్స్ పట్ల పూజా హెగ్డే ఫిదా అయ్యింది.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా పూజా హగ్దే తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీకి, బాలీవుడ్‌కు ఉన్న తేడా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తనకు.. కెరీర్ ప్రారంభంలో చేసిన ‘మొహంజోదారో’మినహా అక్కడ గుర్తింపు తీసుకొచ్చే పాత్రలేవి ఇంతవరకూ రాలేదని చెప్పింది. బాలీవుడ్ తనను ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్‌గానే చూసిందని, తన నటన స్థాయిని పెంచే పాత్రలేవి ఇవ్వలేదని, అంతగా గుర్తు పెట్టుకునే పాత్రలేవి అక్కడ చేయలేదని పూజా వెల్లడించింది.
సౌత్ ఇండస్ట్రీ అలా కాదని, ఇటీవల విడుదలైన ‘రెట్రో’సహా తన కోసం ఇక్కడి దర్శకులు ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రాశారని చెప్పిన పూజా.. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని భావిస్తున్నానని తెలియజేసింది.