నో మాస్క్ కేసు.. మహిళపై అత్యాచారం చేసిన పోలీస్

V6 Velugu Posted on Jun 17, 2021

గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మాస్క్ పెట్టుకోలేదని మహిళను బెదిరించి.. అత్యాచారం చేశాడో పోలీసు అధికారి. పల్సానాకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహిత 2020 లాక్డౌన్ సమయంలో పాలు తీసుకురావడానికి రోడ్డు మీదకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె మాస్క్ పెట్టుకోలేదు. అది గమనించిన నరేష్ కపాడియా అనే కానిస్టేబుల్ ఆమెను అడ్డగించాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించి.. పోలీస్ స్టేషన్ పదా అంటూ తీసుకెళ్లాడు. కానీ, నరేష్.. ఆమెను పోలీస్ స్టేషన్‌కు కాకుండా.. నవసరి రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. మాస్క్ పెట్టుకోనందుకు కేసు బుక్ చేస్తానంటూ బెదిరించాడు. ఆ నెపంతో.. ఆమె అనుచితమైన ఫొటోలు తీశాడు. అనంతరం బెదిరిస్తూ.. ఆమెపై అత్యాచారం చేశాడు. 

‘పాల కోసం వెళ్లిన నన్ను.. మాస్క్ పెట్టుకోలేదని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి.. బెదిరిస్తూ అప్పటి నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడు’ అని బాధితురాలు పల్సానా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. బాధితురాలు తన భర్తతో కలిసి వచ్చి తమ కుటుంబాన్ని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిందని, కులం పేరుతో తిట్టిందని నిందితుడి భార్య ఆరోపిస్తూ కేసు పెట్టింది. దాంతో బాధితురాలు, ఆమె భర్తపై షెడ్యూల్డ్ కులాల చట్టం కింద కేసు నమోదు చేయబడింది.

‘నరేష్ కపాడియా ప్రస్తుతం సూరత్‌లోని ఉమర్‌పాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను గత జనవరిలో ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. నరేష్ జనవరి 2020కి ముందు పల్సానా పోలీస్ స్టేషన్‌లో పని చేసేవాడు. ఆ సమయంలో నరేష్‌కు, బాధితురాలికి మధ్య సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరికీ విభేదాలు రావడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు’ అని సూరత్ పోలీస్ అధికారి తెలిపారు.

Tagged Rape, gujarat, surat, , Umarpada, palsana, police rapes woman, no mask case, no mask rape

Latest Videos

Subscribe Now

More News