తల్లి చనిపోయిందని 1100 కి.మీ. జర్నీ చేసిన పోలీసు

తల్లి చనిపోయిందని 1100 కి.మీ. జర్నీ చేసిన పోలీసు
  • మూడు రోజుల తర్వాత సొంతూరికి
  • చత్తీస్ గఢ్ నుంచి యూపీకి ట్రక్కులు, గూడ్స్ ట్రైన్స్, బోట్ లో ప్రయాణం

రాయ్ పూర్: తల్లి మరణ వార్త తెలుసుకున్న ఓ పోలీస్ లాక్ డౌన్ సమయంలోనూ 1100 కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సంతోష్ యాదవ్ (30) చత్తీస్ గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ 15వ బెటాలియన్ లో పని చేస్తున్నాడు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో పోస్టింగ్ లో ఉన్నాడు. తల్లి చనిపోయిన వార్త అందింది. ఎలాగైనా ఊరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ట్రక్కులు, గూడ్స్ ట్రైన్స్, బోటు ఎక్కి మూడు రోజుల తర్వాత ఊరికి చేరుకున్నాడు. ప్రయాణంలో తనకు సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. “బీజాపూర్ శివారులోని క్యాంపులో ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేసి అమ్మ కండిషన్ సీరియస్ గా ఉందని వారణాసికి తరలిస్తున్నామని చెప్పారు. మరుసటిరోజు సాయంత్రం అమ్మ చనిపోయిందని తెలిసింది. ఎలాగైనా ఊరికి వెళ్లాలని అనుకున్నా. తమ్ముడు, చెల్లి ముంబైలో ఉంటారు. వాళ్లు ఊరికి చేరుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో నాన్నను ఒంటరిగా వదిలేయకూడదని అనుకున్నా. రిలీవింగ్ లెటర్ తీసుకుని ఇంటికి బయలుదేరా. బీజాపూర్ నుంచి కొండగావ్ కు లారీ, మినీ లారీలో చేరుకున్నా. కొండగావ్ దగ్గర పోలీసులు ఆపితే నా పరిస్థితి గురించి చెప్పా. వాళ్లు మెడిసిన్స్ తరలించే వెహికల్ లో రాయ్ పూర్ కు పంపారు. రాయ్ పూర్ లో ఆర్పీఎఫ్ లో పని చేసే ఫ్రెండ్ సాయంతో గూడ్స్ ట్రైన్ ఎక్కా. అక్కడి నుంచి 8 గూడ్స్ ట్రైన్లు మారి చునార్ చేరుకున్నా. 5 కిలోమీటర్లు నడిచి బోటులో గంగా నదిని దాటి మా ఊరికి చేరుకున్నా. ఊరికి రావడానికి మూడు రోజులు పట్టింది” అని సంతోష్ అన్నాడు. తన గ్రామానికి చెందిన 78 మంది రైల్వేలో పని చేస్తారని, వాళ్లంతా తనకు హెల్ప్ చేశారని సంతోష్ గుర్తు చేసుకున్నాడు.