కార్లతో కాలుష్యమైతందని టైర్లల్ల గాలి తీసేసిన్రు

కార్లతో కాలుష్యమైతందని టైర్లల్ల గాలి తీసేసిన్రు
  • స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌లో నిరసనకారుల కొత్త క్యాంపెయిన్

గ్లాస్గో(స్కాట్లాండ్): వాతావరణాన్ని కాపాడాలంటూ స్కాట్లాండ్ లో నిరసనకారులు కొత్త క్యాంపెయిన్ ప్రారంభించారు. లగ్జరీ కార్లతోనే ఎక్కువ కాలుష్యమవుతోందని, పార్క్ చేసిన కార్ల టైర్లల్ల గాలి తీసేస్తున్నారు. గ్లాస్గోలో జరిగిన క్లైమేట్​ ఛేంజ్ కాన్ఫరెన్స్ కాప్ 26 సదస్సు సందర్భంగా దాదాపు 60 కార్ల టైర్లలో గాలి తీసేశారు. గ్లాస్గోలో పోయిన నెల 31న ప్రారంభమైన ఈ సదస్సు శుక్రవారంతో ముగిసింది. సదస్సు జరిగిన రోజుల్లో గ్లాస్గో సిటీ, దాని చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాల్లో పెట్టిన కార్ల టైర్లల్లో గాలి తీసేసిన నిరసనకారులు.. ‘‘మీరు క్లైమేట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ”ఆయా కార్లపై పార్కింగ్ టికెట్ లాగా ఒక పాంప్లెట్ పెట్టారు. ‘‘మీ ఎస్ యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్)లతో కాలుష్యం ఎక్కువవుతోంది. గత దశాబ్ద కాలంగా ఎక్కువ కార్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న వాటిలో ఇవే రెండో ప్లేసులో ఉన్నాయి. అందుకే మీ కార్ల టైర్లలోని గాలి తీసేస్తున్నాం. అందరూ లగ్జరీ లైఫ్ ను కోరుకుంటూ కాలుష్యానికి కారణమవుతున్నారు. దాన్ని తగ్గించేందుకు మీరే చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వెళ్లండి” అని అందులో పేర్కొన్నారు. కాప్ సదస్సు సందర్భంగా ఆందోళనలు చేపట్టేందుకు గ్లాస్గోకు తరలివచ్చిన నిరసనకారుల్లో కొందరు గ్రూపుగా ఏర్పడి ‘‘టైర్డ్ ఆఫ్ ఎస్ యూవీస్’’ పేరుతో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. వారిని పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు.