నీట్ పేపర్ లీక్.. మాస్టర్ మైండ్ అరెస్టు

నీట్ పేపర్ లీక్.. మాస్టర్ మైండ్ అరెస్టు
  • రవి అత్రిని అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు
  • సాల్వర్ గ్యాంగ్ పనేనని దర్యాప్తులో వెల్లడి 
  • నీట్ రద్దుపై సుప్రీంకోర్టుదే తుది నిర్ణయం: ధర్మేంద్ర ప్రధాన్ 
  • లక్షలాది మందిపై ప్రభావం పడుతుందనే ఎగ్జామ్ రద్దు చేయలేదని క్లారిటీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వెనుక ‘సాల్వర్ గ్యాంగ్’ ఉందని తేలింది. మాస్టర్ మైండ్ రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో కొంతమంది విద్యార్థులు, మధ్యవర్తులను ఇప్పటికే అరెస్టు చేసిన బిహార్ పోలీసులు.. వాళ్లను లోతుగా విచారించడంతో సాల్వర్ గ్యాంగ్ విషయం బయటపడింది. దీని వెనుక రవి అత్రి ఉన్నడని తెలిసి, అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రవిని అరెస్టు చేశారు. రవి అత్రి తన నెట్ వర్క్ ద్వారా సాల్వ్ డ్ క్వశ్చన్ పేపర్లను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. అందుకే ఈ గ్యాంగ్ ను ‘సాల్వర్ గ్యాంగ్’ అంటారు. గ్రేటర్ నోయిడాలోని నీమ్కా గ్రామానికి చెందిన రవి అత్రి.. వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేశాడనే ఆరోపణలతో 2012లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రవిని అరెస్టు చేశారు. 

మెడిసిన్ మధ్యలోనే మానేసి.. 

రవి అత్రి కూడా మెడికల్ స్టూడెంటే. కానీ చదువు పూర్తి చేయకుండా మధ్యలోనే మానేశాడు. 2007లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం రవిని అతని కుటుంబం రాజస్థాన్ లోని కోటాకు పంపించింది. ఆ ఎగ్జామ్ ను 2012లో రవి క్లియర్ చేశాడు. హర్యానాలోని పీజీఐ రోహతక్ లో అడ్మిషన్ పొందాడు. కానీ నాలుగో ఏడాది ఎగ్జామ్స్ రాయలేదు. ఆ తర్వాత ‘ఎగ్జామ్ మాఫియా’తో చేతులు కలిపాడు. మొదట్లో స్టూడెంట్లకు బదులుగా తాను వెళ్లి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవాడు. ఆపై పేపర్ లీకేజీల్లో కీలకంగా మారాడు. లీక్ అయిన పేపర్లను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టాడు. 

కొంతమందికే పేపర్ లీక్: ధర్మేంద్ర ప్రధాన్ 

నీట్ రద్దుపై సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ కొంతమందికే లీక్ అయిందని, అందుకే ఎగ్జామ్​ను రద్దు చేయలేదని చెప్పారు. శనివారం ఢిల్లీలో మీడియాతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ‘‘నీట్ క్వశ్చన్ పేపర్ కొంతమంది స్టూడెంట్లకే లీక్ అయింది. ఎగ్జామ్ రద్దు చేస్తే, లక్షలాది మందిపై ప్రభావం పడుతుంది.

నిజాయతీగా ఎగ్జామ్ రాసి, క్లియర్ చేసినోళ్లకు అన్యాయం చేసినట్టవుతుంది. ఈ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయమే ఫైనల్” అని ఆయన తెలిపారు. ‘‘మేం బిహార్ పోలీసులతో టచ్​లో ఉంటున్నాం. ఈ కేసుపై రిపోర్టు ఇవ్వాలని కోరాం. అది అందాక, ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. దీనికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. వ్యవస్థలోని లోపాలను సరిచేస్తాం. మన వ్యవస్థలపై నమ్మకం ఉంచుదాం. ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం సహించదు” అని చెప్పారు.

పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం హైలెవల్ కమిటీ..

నీట్, నెట్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండడం కోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ పరీక్షల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్​లో ఇంప్రూవ్ మెంట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు మెరుగుపరిచేందుకు తగిన సిఫార్సులు చేస్తుంది” అని విద్యాశాఖ పేర్కొంది.

ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, హెచ్​సీయూ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కె.రామమూర్తి, కర్మయోగి భారత్ బోర్డు మెంబర్ పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ ఉన్నారని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.