కరోనా కేసులు తగ్గుతలే.. డెత్​లు ఆగుతలే

కరోనా కేసులు తగ్గుతలే.. డెత్​లు ఆగుతలే

 

  • కేసులు తగ్గుతలే.. డెత్​లు ఆగుతలే
  • ఒకే రోజు 72,330 కొత్త కేసులు.. 459 మంది మృతి
  • మహారాష్ట్రలోనే సగానికిపైగా కేసులు, మరణాలు
  • 93.89 శాతానికి పడిపోయిన రికవరీ రేటు

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 72,330 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే ఎక్కువ. కిందటేడాది అక్టోబర్ 11తర్వాత ఆ స్థాయిలో కేసులు ఇప్పుడే నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే సగానికిపైగా(39,544)  వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం పేర్కొంది. ఇప్పటిదాకా 1,14,74,683 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 11.25 లక్షల టెస్టులు చేశారు. మొత్తంగా 24.47 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

22 రోజులుగా డెత్స్ పెరుగుతున్నయ్

వైరస్​మరణాలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం దాకా 459 మంది చనిపోయారు. గడిచిన 116 రోజుల్లో ఇదే అత్యధికం. 22 రోజులుగా డెత్స్ పెరుగుతూనే ఉన్నాయి.  24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 227 మంది,  పంజాబ్​లో 55 మంది, చత్తీస్​గఢ్​లో 39 మంది చనిపోయారు. మొత్తంగా డెత్స్ 1,62,927కి చేరాయి. ఇటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం 5,84,055 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. మొత్తం కేసుల్లో ఇది 4.78%. మరోవైపు రికవరీ రేటు తగ్గుతూ వస్తోంది. తాజాగా 93.89కి పడిపోయింది.

ఈనెలలో అన్ని రోజులూ వ్యాక్సిన్
ఏప్రిల్​లో పబ్లిక్ హాలీడేలు సహా అన్ని రోజులూ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.