కరోనా కలకలం.. గ్రామంలో లాక్ డౌన్

కరోనా కలకలం.. గ్రామంలో లాక్ డౌన్

జగిత్యాల జిల్లా: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు జాగ్రత్తతో పలు గ్రామాలు లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. మంగళవారం జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో లాక్ డౌన్ విధించారు. ఇబ్రహీంపట్నంకు చెందిన  ఇద్దరు వ్యక్తులు సోమవారం హైదరాబాద్ లో ఒకరు, నిజామాబాద్ లో మరొకరు చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు లాక్ డౌన్ విధించాలని సర్పంచ్ కు తెలిపారు. వెంటనే లాక్ డౌన్ విధిస్తూ  గ్రామపంచాయతీ తీర్మానించింది. ఏప్రిల్ 6 నుంచి ఈనెల ఏప్రిల్ 21 వరకు ఈ లాక్ డౌన్ విధిస్తున్నట్టు పంచాయతీ తీర్మానంలో తెలిపారు సర్పంచ్. ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. వెయ్యి రూపాయల జరిమాన విధించనున్నట్టు పాలకవర్గం తీర్మానించిందన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఇద్దరు చనిపోవడంతో పాటు.. ఊళ్లో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే మల్లాపూర్ మండలం, సిరిపూర్ లో కూడా దశదినకర్మకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 27 మందికి కరోనా సోకి.. ఆ తర్వాత కేసులు పెరుగుతుండటంతో.. రెండ్రోజుల కింద లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.