ఓనంతో కేరళలో మళ్లీ పుంజుకున్న కరోనా కేసులు

ఓనంతో కేరళలో మళ్లీ పుంజుకున్న కరోనా కేసులు
  • ఓనం ఎఫెక్ట్.. కేరళలో పాజిటివిటీ రేటు పైపైకి
  • మూడ్రోజుల్లో 3%  పెరిగి 17.73 శాతానికి  చేరిందన్న ఎక్స్ పర్ట్స్ 

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంపై మెడికల్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిబంధనలు సడలించడం, ఓనం ఫెస్టివల్ సెలబ్రేషన్స్, షాపింగ్ కారణంగా డైలీ పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్పారు. ఈ నెల 16న 14.03 శాతమున్న డైలీ పాజిటివిటీ రేటు.. 21 నాటికి 17.73 శాతానికి పెరిగిందని తెలిపారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా రూల్స్ పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ‘‘జనం తలపై గన్ పెట్టి రూల్స్ పాటించేలా చేయలేం కదా. వాళ్లకు వాళ్లే స్వచ్ఛందంగా రూల్స్ పాటించాలి. వాళ్ల బిహేవియర్ ను మార్చుకోవాలి” అని మెడికల్ ఎక్స్ పర్ట్స్ డాక్టర్ అమర్ ఫెటిల్, డాక్టర్ కన్నన్ అభిప్రాయపడ్డారు. 

డైలీ కేసుల్లో సగం ఇక్కడే.. 
ప్రతిరోజూ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేరళలోనే ఉంటున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 34,457 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 17,106  ఉన్నాయి. ఎకానమీ దెబ్బతినకుండా రిలాక్సేషన్స్ ఇవ్వడం ముఖ్యమేనని, కానీ ప్రజలు రూల్స్ పాటించకపోవడం వల్లనే కేసులు పెరుగుతున్నాయని ఎక్స్ పర్ట్స్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డెల్టా వేరియంట్ యాక్టివ్ గా ఉందని, కేసులు పెరగడానికి అది కూడా కారణమని చెప్పారు. పాజిటివిటీ రేటు తగ్గడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 40 నుంచి 60 శాతం హాస్పిటల్ బెడ్లే నిండాయని స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఫెటిల్ తెలిపారు. కరోనా సోకినోళ్లందరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావడం లేదన్నారు.

దేశంలో యాక్టివ్ కేసులు 3.53 లక్షలకు
5 నెలల్లో ఇదే అతి తక్కువ  
కొత్త కేసులు 31 వేలు, డెత్స్ 403
 

న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారంతో పోలిస్తే మరో 8 వేల కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 7,942 యాక్టివ్ కేసులు తగ్గాయని, ప్రస్తుతం 3,53,398 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. గత 5 నెలల్లో ఇదే అతి తక్కువని తెలిపింది. కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.24 కోట్లకు చేరిందని చెప్పింది. వైరస్ తో మరో 403 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,34,367కు పెరిగిందని పేర్కొంది. శనివారం 15,85,681 టెస్టులు చేశామని, దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 50.62 కోట్లకు చేరిందంది. ఇప్పటి వరకు 3.16 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారంది. రికవరీ రేటు 97.57 శాతానికి పెరిగిందని, ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2 శాతంగా, డెత్ రేటు 1.34 శాతంగా నమోదైందని తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మహారాష్ట్రలో 145, కేరళలో 83 ఉన్నాయని చెప్పింది. కాగా, వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58.14 కోట్ల టీకా డోసులను వేసినట్లు పేర్కొంది.