విజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి

విజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి

కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఆదివారం (మే 25) ఉదయం కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని థానేలో కోవిడ్-19 లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 21 ఏండ్ల యువకుడు.. చికిత్స పొందుతూ ఉదయం చనిపోయాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కల్వా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు థానే మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. 

మే 22న అనారాగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన యువకుడికి.. కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యాధికారులు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.

కర్ణాటకలో కూడా కరోనా కేసులో మృతి చెందడం కలకలం రేపింది. బెంగళూరులోని ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల వృద్ధుడు శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు అధికారులు. శనివారం రిపోర్టు రావడంతో చికిత్స మొదలు పెట్టారు. కానీ .. ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో చనిపోయాడు. 

కర్ణాటక ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కర్ణాటకలో 38 కేసులు నమోదవ్వగా... అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో.. కర్ణాటక, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అయితే కోవిడ్-19పై ఆందోళన చెందవద్దని, కావాల్సిన జాగ్రత చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.  అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయని.. వ్యాప్తి తక్కువగానే ఉంది.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా257 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని, హాస్పిటల్ కు వెళ్లాల్సినంత తీవ్రమైన కేసులేం కావని తెలిపింది.