కణాలకు సులువుగా అంటుకునేలా స్పైక్స్ ప్రొటీన్స్ లో మార్పులు
ఇమ్యున్ సిస్టమ్ కు దొరక్కుండా ఓ ప్రొటీన్ మాయం
శరవేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి
ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు దానిపై పనిచేస్తాయంటున్న సైంటిస్టులు
మరిన్ని మ్యుటేషన్లు జరిగితే మాత్రం కంట్రోల్ తప్పినట్టే
లండన్: దక్షిణ ఇంగ్లండ్ ప్రాంతంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి సైంటిస్టులు స్టడీ చేసి కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. శాంపిల్స్‌పై సెప్టెంబర్ నుంచి రీసెర్చ్ చేసి.. ఈ రకం వైరస్ 70 శాతం వేగంగా అంటుకుంటోందని తేల్చారు. బ్రిటన్‌లో నమోదవుతున్న కొత్త కేసుల్లో చాలావరకు కొత్త రకం వైరస్ సోకినవేనని నిర్ధారించారు. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో)కు బ్రిటన్ సమాచారం ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడంతో అంతటా కలకలం చెలరేగింది. కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇప్పటికే బ్రిటన్ నుంచి రాకపోకలు బంద్ పెట్టాయి. చాలా దేశాలు కూడా అదేదారిపట్టాయి. మరోవైపు కొన్ని ఇతర దేశాల్లోనూ కొత్త రకం వైరస్ కేసులు బయటపడటం ఆందోళన రేపుతోంది. కొత్త వైరస్‌పై ఇంటర్నెట్లో విపరీతంగా సెర్చింగ్ జరుగుతోందని గూగుల్ కూడా ప్రకటించింది. అసలు ఈ కొత్త రకం ఏంటి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా సైంటిస్టులు కొన్ని అంచనాలు వేశారు.
ఈ మూడు కారణాలతో..
సాధారణంగా చాలా వరకు వైరస్లు పరిస్థితులను తట్టుకునేందుకు మార్పు (మ్యుటేషన్) చెందుతూ ఉంటాయి. అయితే వాటి జన్యు క్రమం, బేసిక్ లక్షణాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండదు. కొన్ని రకాలు కొంత బలంగా, మరికొన్ని బలహీనంగా మారుతుంటాయి. కరోనా వైరస్ కూడా ఇప్పటివరకు ఇలా వందల రకాలుగా మ్యుటేషన్ చెందినట్టు సైంటిస్టులు గుర్తించారు. కొన్నిసార్లు మాత్రం వైరస్ లలో మార్పు ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఆ వైరస్‌ను అడ్డుకొనేందుకు, చంపేసేందుకు రూపొందించే మందులు, వ్యాక్సిన్లు సరిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో గుర్తించిన కొత్త రకం కూడా ఎక్కువగా మ్యుటేషన్లకు గురైనట్టుగా సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రధానంగా మూడు కారణాల వల్ల కొత్త వైరస్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ రకాలను మించి.. కొత్త రకం విపరీతంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఈ కొత్త రకాన్ని గుర్తించినప్పుడు కొందరికి అది పరిమితమైనా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో చాలా మందిలో ఈ రకం వైరస్ ఉంటోంది.
కొత్త రకం వైరస్‌లో మ్యుటేషన్లు దానికి చాలా ముఖ్యమైన ‘స్పైక్స్(కొమ్ములు)’లో వచ్చాయి. కరోనా వైరస్ ఈ స్పైక్స్ ఆధారంగానే మన శరీరంలోని కణాలకు అంటుకుని విస్తరిస్తుంది. ఈ స్పైక్స్‌ను బలహీనం చేసే దిశగానే చాలా వరకు వ్యాక్సిన్లను డెవలప్ చేస్తున్నారు.
కొత్త రకం వైరస్‌లో వచ్చిన మ్యుటేషన్లపై ల్యాబ్‌లో రీసెర్చ్ చేసినప్పుడు.. ఈ వైరస్ శరీరంలోని కణాలకు అతుక్కునే కెపాసిటీ బాగా పెరిగిందని గుర్తించారు.
అయితే ఈ కొత్త రకం వైరస్‌కు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని.. మరింతగా రీసెర్చ్ చేసి, ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తేల్చాల్సి ఉందని కొవిడ్ జినోమిక్స్ యూకే కన్సార్షియం సైంటిస్ట్ నిక్ లోమన్ చెప్పారు. ఈ రీసెర్చ్‌కు చాలా టైం పడుతుందని.. వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న ఈ టైంలో నెలల పాటు వెయిట్ చెయ్యలేమని పేర్కొన్నారు.
ఇంతకుముందు రెండు సార్లు ఇట్లనే..
ఇప్పుడు బ్రిటన్‌లో జరిగిన మ్యుటేషన్ తరహాలోనే ఇంతకుముందు కూడా కరోనా వైరస్‌లో మార్పులు జరిగి కొత్త రకాలు ఏర్పడ్డాయి. అసలు చైనాలోని వుహాన్‌లో మొదటిసారిగా గుర్తించిన కరోనా వైరస్‌కు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వైరస్‌లకు చాలా తేడా ఉంటుంది.
చైనా నుంచి యూరప్ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మ్యుటేట్అయింది. అంతకుముందటి రకంతో పోలిస్తే వేగంగా విస్తరించే కెపాసిటీ ఉన్న ఆ రకానికి ‘డీ614జీ’గా పేరు పెట్టారు. ఇది యూరప్ నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో స్పెయిన్‌లో మరో రకం అత్యంత వేగంగా వ్యాపించింది. ‘ఏ222వీ’గా పేరు పెట్టిన ఈ వైరస్.. యూరప్ అంతటా విస్తరించింది. అయితే అప్పటికే విమానాల నిలిపివేత, లాక్డౌన్లు మొదలవడంతో.. దూర దేశాలకు
వ్యాపించలేదు.
ఎంత వేగంగా వ్యాపిస్తోంది?
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్తొలి కేసును సెప్టెంబర్‌లో గుర్తించారు. తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగింది. నవంబర్‌లో లండన్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పావు వంతు కొత్త రకానివే ఉండగా.. ఈ నెల మొదట్లో సగానికిపైగా, ఇప్పుడు 80 శాతం కేసులు కొత్త రకానివే ఉంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. అంటే కొత్త రకం వైరస్ విస్తరణ చాలా వేగంగా ఉంటోంది. ఆదివారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కొత్త వైరస్.. 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోందని ప్రకటించారు. మిగతా కరోనా వైరస్ రకాలన్నింటికన్నా కొత్త రకం ఎక్కువ స్పీడ్‌గా విస్తరిస్తోందని చెప్పారు.
ఇది ప్రమాదకరమా?
కొత్త రకం వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందేగానీ.. దానివల్ల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు ఆధారాలేమీ లేవని సైంటిస్టులు, డాక్టర్లు చెప్తున్నారు. డెత్‌రేటు కూడా ఏమీ పెరగలేదని అంటున్నారు. అయితే వేగంగా, ఎక్కువ మందికి వైరస్ సోకడంతో హాస్పిటళ్లు నిండిపోతాయని.. అవసరమైన వారికి ట్రీట్మెంట్ అందక సమస్యలు తలెత్తుతాయని, డెత్స్ పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఎక్కడెక్కిడికి చేరింది?
బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ను గుర్తించినా.. అది బ్రిటన్‌లోనే మ్యుటేట్ అయిన వైరసా, లేక కరోనా రకాలను గుర్తించలేని ఏదైనా వేరే దేశం నుంచి వచ్చిందా అన్నది తేల్చాల్సి ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మొదట్లో బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో కొత్త రకం కేసును గుర్తించారు. తర్వాత ఒక్క ఐర్లాండ్ ఏరియా తప్ప ఆ దేశమంతటా వ్యాపించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ల జెనెటిక్ కోడ్స్‌ను మానిటర్ చేసే ‘నెక్ట్స్ స్ట్రెయిన్’ సంస్థ.. ఈ కొత్త రకం వేరే దేశాలకు వెళ్లిందా, లేదా అన్న దానిపై స్టడీ చేసింది. డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇటలీ దేశాల్లో ఈ కొత్త రకం వైరస్ కేసులు నమోదైనట్టు తేల్చింది.
బ్రిటన్‌లో వచ్చిన కొత్త రకం కరోనా తరహాలోనే.. సౌతాఫ్రికాలో కూడా మరో కొత్త రకం వైరస్‌ను గుర్తించారు. ఈ రెండు కొత్త వైరస్లలో జరిగిన మ్యుటేషన్లు చాలా వరకు ఒకేలా ఉన్నా.. ఈ రెండూ వేరేనని తేల్చారు.
చాలా దేశాలకు వైరస్ జెనెటిక్స్ కోడ్స్‌ను, మ్యుటేషన్లను గుర్తించే కెపాసిటీ లేనందున.. ఇంకా ఎన్ని దేశాలకు ఈ వైరస్లు వ్యాపించాయో తెలియాల్సి ఉంది.
ఎలా మారి ఉంటది?
బ్రిటన్‌లో గుర్తించిన కొత్త రకం వైరస్‌లో అసాధారణంగా మ్యుటేషన్లు జరిగాయి. ఇమ్యునిటీ అతి తక్కువగా ఉన్న వ్యక్తి శరీరంలో వైరస్ ఇలా మ్యుటేట్ అయి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అలాంటి వారి శరీరం వైరస్‌తో పోరాడ లేదని.. అది వైరస్ మ్యుటేషన్లకు గ్రౌండ్‌గా మారిపోతుందని అంటున్నారు.
‘ఇప్పుడొచ్చిన వ్యాక్సిన్లు పనిచేస్తయా?
కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతానికి కొత్త రకం వైరస్ నుంచి కూడా రక్షణ కల్పించగలవని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా వ్యాక్సిన్లు.. వైరస్‌పై ఉండే స్పైక్స్తోపాటు ఇతర భాగాలను కూడా టార్గెట్ చేసేలా మన శరీరంలోని ఇమ్యున్ సిస్టమ్‌ను ప్రేరేపిస్తాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా తెలిపారు. ‘‘స్పైక్స్లో మ్యుటేషన్లు వచ్చినా కూడా ఇమ్యున్సిస్టమ్ వైరస్‌ను గుర్తించి చంపేస్తుంది. అయితే వైరస్‌కు మరిన్ని మ్యుటేషన్లు వస్తే మాత్రం కష్టమే. వ్యాక్సిన్ల నుంచి వైరస్ తప్పించుకునే చాన్స్ ఉంది. అలాగైతే మరింతగా ఇన్ఫెక్ట్ అవుతూనే ఉంటుంది. కరోనా వైరస్‌కు ఈ కెపాసిటీ ఉంది. అయితే కరోనా మ్యుటేషన్లకు తగినట్టుగా మనం వ్యాక్సిన్లను కూడా ఈజీగానే మార్చగలం.”
అని వివరించారు.
కొత్త వైరస్‌లో వచ్చిన మ్యుటేషన్ ఏమిటి?
వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేందుకు వాటికి ఉండే ‘స్పైక్స్(కొమ్ముల వంటి నిర్మాణాలు)’ కీలకం. వైరస్లు ఆ స్పైక్స్ తోనే మన శరీరంలోని కణాలకు అతుక్కుని.. కణాల పైపొరకు రంధ్రం చేస్తాయి. తర్వాత వైరస్ జెనెటిక్ మెటీరియల్కణం లోపలికి వెళ్లి ఆక్రమించుకుంటుంది. కణంలోని జెనెటిక్ మెటీరియల్, ఇతర భాగాలను వాడుకుని వేల సంఖ్యలో వైరస్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మరిన్ని కణాలకు అతుక్కుని.. మరింతగా వైరస్ పెరిగిపోతుంది. దీంతో వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఇట్లా వైరస్ వ్యాప్తికి కీలకమైన స్పైక్స్లో కీలకమైన రెండు మ్యుటేషన్లు జరిగినట్టు సైంటిస్టులు తేల్చారు.
కరోనా వైరస్ స్పైక్స్ శరీరంలోని కణాలకు మొదట అతుక్కునేందుకు తోడ్పడే ప్రొటీన్‌లో మ్యుటేషన్ వచ్చినట్టు గుర్తించారు. ఈ మ్యుటేషన్‌కు ‘ఎన్501వై’ అని పేరు పెట్టారు. ఈ మార్పు వల్ల వైరస్ మరింత సులువుగా, వేగంగా కణాలకు అతుక్కుంటోందని తేల్చారు.
ఇక రెండో మ్యుటేషన్లో.. వైరస్ స్పైక్స్లో ముందు నుంచీ ఉన్న ‘హెచ్69/వీ70’ అనే ప్రొటీన్ మాయమైందని సైంటిస్టులు గుర్తించారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి రెండింతలు పెరిగినట్టుగా తేలిందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా వెల్లడించారు. ఈ ‘హెచ్69/వీ70’ ప్రొటీన్‌ను మన శరీరంలోని ఇమ్యున్ సిస్టమ్ గుర్తించి, వైరస్‌పై దాడి చేసి చంపేస్తుందని.. ఇప్పుడీ ప్రొటీన్
లేకపోవడంతో వైరస్‌పై ఇమ్యున్ సిస్టం సమర్థవంతంగా పనిచేయలేదని వివరించారు.
