ఆర్టీసీపై కరోనా పంజా.. అధికారికంగా 1,600 కేసులు.. 30 మంది మృతి

V6 Velugu Posted on May 06, 2021

  • అధికారుల లెక్కల ప్రకారమే ఈ కేసులు
  • 2 వేల కేసులు, 50 మంది మరణించారంటున్న యూనియన్లు
  • ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, 
  • గ్లోవ్స్ ఇస్తలేరు.. బస్సుల్లో పత్తాలేని శానిటైజేషన్‌
  • తార్నాక హాస్పిటల్‌లో కరోనా వార్డు పెట్టాలని డిమాండ్
  • పట్టించుకోని సర్కారు, మేనేజ్‌మెంట్‌.. ఆందోళనలో ఉద్యోగులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. వైరస్ బారిన పడుతున్న డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైవర్లు, కండక్టర్లకు శానిటైజర్లు, మాస్క్‌‌లు, గ్లోవ్స్ ఇవ్వకపోవడం, బస్సుల్లో శానిటేషన్ చేయకపోవడంతో భయంభయంగానే డ్యూటీ చేస్తున్నారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌‌లో కరోనా వార్డు పెట్టాలని యూనియన్లు ఏడాదిగా డిమాండ్‌‌ చేస్తున్నా ప్రభుత్వం, మేనేజ్‌‌మెంట్‌‌  పట్టించుకోవట్లేదు. మరోవైపు రోజుకు రూ.12 కోట్లు వచ్చే కలెక్షన్ కరోనా భయంతో ఇప్పుడు రూ.4 కోట్లు కూడా రావట్లేదు.
2 వేలకు పైనే కరోనా కేసులు
రాష్ట్రంలోని 97 డిపోల్లో 48,394 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. ప్రజా రవాణా కావడంతో తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. నిత్యం ప్రయాణికులతో టచ్ లో ఉంటుండడంతో కరోనా ప్రభావం సంస్థ ఉద్యోగులపై ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,600.. సిటీలో 900కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. 30 మంది వరకు చనిపోయారంటున్నారు. కానీ 2 వేలకు పైగా కేసులు, 50కి పైగా మరణాలు నమోదయ్యాయని యూనియన్లు అంటున్నాయి. ఒక్క మెట్‌‌పల్లి డిపోలోనే ఇప్పటిదాకా 36 కేసులు నమోదయ్యాయి.
కరోనా వచ్చిన వాళ్లను పట్టించుకుంటలె
డ్రైవర్లు, కండక్టర్లకు శానిటైజర్లు, గ్లోవ్స్, మాస్కులను ఆర్టీసీ గతేడాది అందించింది. ఈ ఏడాది వారి భద్రతను గాలికొదిలేసింది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లే సొంతంగా తెచ్చుకుంటున్నారు. గతంలో బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌‌ చేసేవారు. ఈ సారి అదీ మర్చిపోయారు. దీంతో ఉద్యోగులు భయంభయంగా పని చేస్తున్నారు. కరోనా వచ్చిన వాళ్లను  పట్టించుకోవట్లేదు. హైదరాబాద్‌‌లోని తార్నాకలో ఉన్న హాస్పిటల్ లో కరోనా వార్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆర్టీసీ, సర్కారు పట్టించుకోవట్లేదు. 

బస్సుల్లో తగ్గిన జర్నీ

ఆర్టీసీలో 9 వేల వరకు బస్సులు ఉండగా గతేడాది కరోనా తర్వాత 6 వేలే నడుస్తున్నాయి. తాజాగా ఏప్రిల్‌‌ చివరినాటికి  ఇందులో 50 శాతం బస్సులనే తిప్పుతున్నారు. కరోనా భయంతో ప్రయాణికులు కూడా బస్సుల్లో జర్నీ తగ్గించారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 40 శాతానికి పడిపోయింది. రోజుకు రూ. 12 కోట్ల కలెక్షన్ రావాల్సి ఉండగా రూ. 4 కోట్లకు పడిపోయింది.  
రూ. 50 లక్షల బీమా వర్తింపజేయాలె
కరోనాతో అనేక మంది డ్రైవర్లు, కండక్టర్లు పిట్టల్లా రాలుతున్నరు. అన్ని రీజియన్ కేంద్రాల్లో కరోనా ట్రీట్ మెంట్ అందించాలి. కరోనాతో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు రూ. 50 లక్షల ప్రత్యేక బీమా వర్తింపజేయాలి. తార్నాక హాస్పిటల్‌లో కరోనా వార్డు ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కు రిఫర్ చేయాలి. ట్రీట్ మెంట్ డబ్బులు రీయింబర్స్ చేయాలి.– వీఎస్ రావు, జనరల్ సెక్రటరీ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ 
శానిటైజర్లు, మాస్కులు ఇయ్యాలె
తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో కరోనా వార్డు పెట్టాలని ఏడాదిగా డిమాండ్‌ చేస్తున్నాం. సర్కారు, మేనేజ్‌మెంట్‌ నుంచి ఉలుకుపలుకు లేదు. కండక్టర్లు, డ్రైవర్లు రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నా పట్టించుకోవట్లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు మాస్కులు, గ్లోవ్స్, శానిటైజర్లు ఇవ్వాలి. -హనుమంతు ముదిరాజ్‌, జనరల్‌ సెక్రటరీ, టీజేఎంయూ
 

Tagged , corona claw on ts rtc, ts rtc corona cases, ts rtc corona deaths, ts rtc updates

Latest Videos

Subscribe Now

More News