కరోనా మృతుల దహనానికి కట్టెలు లేవు

కరోనా మృతుల దహనానికి కట్టెలు లేవు
  • కరోనా మృతుల దహనానికి ఇబ్బందులు
  • వెయ్యి టన్నుల కలప ఇస్తామన్న ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

హైదరాబాద్, వెలుగు: కరోనాతో రోజూ డజన్లకొద్ది జనం చనిపోతున్నారు. వారి డెడ్​బాడీలను దహనం చేయడానికి కట్టెల కొరత ఏర్పడింది.  దీంతో వెయ్యి టన్నుల కట్టెలను ఇస్తామని ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో శ్మశానాల్లో కట్టెల కొరత ఏర్పడిందని, ఈ కొరతను తీర్చేందుకు రూ.20 లక్షల విలువ చేసే కట్టెలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎఫ్‌డీసీ చైర్మన్‌, టీఆర్‌‌ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎఫ్‌డీసీ తరఫున ఏటా పేపర్ మిల్లులకు అమ్మేందుకు ప్లాంటేషన్ జరుగుతుంటుందని, అలా పేపర్‌‌ మిల్లుల కోసం కొట్టిన కలప వాటికి అమ్మగా వెయ్యి టన్నులు మిగిలిందని ఆయన చెప్పారు. ఈ కలపను హైదరాబాద్ సహా సమీప మున్సిపాలిటీల శ్మశానాలకు సరఫరా చేస్తామన్నారు. అంత్యక్రియలకు అవసరమైన వెదురును కూడా సరఫరా చేస్తామని చెప్పారు. కలప ధర పెరగడంతో తమ వారి అంత్యక్రియలకు పేదలు ఇబ్బంది పడుతున్నారని వంటేరు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించి, తాము అందించే కలపను ఫ్రీగా తీసుకోవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్ పరిధిలోని అంబర్‌‌పేట, బన్సీలాల్ పేట, ఆసిఫ్‌నగర్, ఈఎస్ఐ శ్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామన్నారు. కాగా, కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు ముందుకు వచ్చాయని ఎఫ్‌డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం చెబుతున్నది వేరు.. స్మశానాల్లో పరిస్థితి వేరు

ఆరోగ్య శాఖ రోజూ రిలీజ్ చేస్తున్న బులిటెన్ల ప్రకారం మార్చి 15 నుంచి ఇప్పటి వరకు 822 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు సోమవారం అత్యధికంగా 59 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కానీ శ్మశానాల్లో పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. శవ దహనానికి కట్టెలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కట్టెల కొరత, రేటు పెరగడం, ఇప్పడు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ స్పందించి కట్టెలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం చూస్తే.. రాష్ట్రంలో కరోనా, సహజ మరణాలు కలిపి రోజూ ఎంత మంది చనిపోతున్నారన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఫారెస్ట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్వయంగా.. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కరాల కోసం కట్టెల కొరత ఏర్పడడంతో తాము ఉచితంగా వెయ్యి టన్నులు ఇస్తున్నామని చెప్పడం ద్వారా కరోనా మరణాలపై ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ పరిస్థితికి తేడా ఉందని అర్థమవుతోంది.
శ్మశానాల్లో పరిస్థితి వేరు
రాష్ట్రంలో మార్చి మధ్య నుంచి కరోనా సెకండ్ వేవ్‌ స్టార్ట్ అయింది. అయితే మన దగ్గర కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.