ఆ నలుగురూ కరువు!: పాడె కట్టరు.. కట్టె పేర్చరు!

ఆ నలుగురూ కరువు!: పాడె కట్టరు..  కట్టె పేర్చరు!

కరోనా మృతుల అంత్యక్రియల కోసం నానా పాట్లు
కరోనా అని చెప్తే దహనం చేయనివ్వరని విషయం దాస్తున్న బంధువులు
అంతిమ సంస్కరాలు చేసేవాళ్లకు, శ్మశానాల సిబ్బందికీ టెన్షన్
బాడీలు పూర్తిగా కాలిపోకున్నా పట్టించుకునేవాళ్లు లేరు
హైదరాబాద్, వెలుగు: కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేసే వ్యవహారం ఆందోళనకరంగా మారింది. డెడ్బాడీని తరలించేందుకు మనుషులుగానీ, వెహికల్స్గానీ దొరకని పరిస్థితి నెలకొంది. దగ్గరివారూ దహన సంస్కారాలకు రాలేకపోతున్నారు. బాడీని ముట్టుకోవడానికి, పాడె మోయడానికి, కట్టెలు పేర్చడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంతా జీహెచ్ఎంసీ సిబ్బందే చేస్తున్నారు. అసలు మృతదేహాలు పూర్తిగా కాలిపోకున్నా పట్టించుకునేవాళ్లు లేరు. మరోవైపు శ్మశానాల చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని జనాలు కరోనా బాడీలను కాల్చొద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినట్లేదు. ఆ పొగ, దుమ్ముతో తమకెక్కడ వైరస్ వ్యాపిస్తుందోనంటూ అడ్డుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది.

ఫ్యామిలీకి దూరంగానే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనాతో చనిపోయినవాళ్ల దహన సంస్కారాలన్నీ స్థానిక సంస్థల సాయంతో బల్దియానే చేస్తోంది. అయితే సరిపడా సిబ్బంది లేక ఇబ్బంది అవుతోంది. జాప్యం జరుగుతోంది. రాత్రికి రాత్రి చనిపోతే కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి బాడీని తీసుకెళ్తున్నారు. ఒకరిద్దరు తప్ప కుటుంబ సభ్యుల్లేకుండానే దహన సంస్కారాలు జరుగుతున్నాయి. తమవాళ్లు దూరమయ్యారనే బాధ ఓవైపు, కనీసం దేహాన్ని కూడా తాకలేని ఆవేదన మరోవైపు కన్నీరు పెట్టిస్తోంది. ఇక కాటి కాపరులు, సిబ్బంది కూడా డెడ్బాడీలను ముట్టేందుకు భయపడ్తున్నారు. మృతదేహాలు సరిగా కాలిపోకున్నా చూసేవాళ్లులేరు. ఇటీవల హైదరాబాద్లోని సనత్ నగర్ శ్మశాన వాటికలో వానకు మంటలు ఆరిపోవడంతో సగం కాలిన శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలిచివేసింది. ఆ పరిసరాల్లో ఉండే మధురానగర్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ జనాలు ఇప్పటికీ దాన్ని తల్చుకుని భయపడుతున్నారు.

శ్మశానాల చుట్టూ భయం భయం

శ్మశాన వాటికల చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం ఆందోళన చేస్తున్నారు. డెడ్ బాడీలను కాల్చాకపొగ, బూడిద ఇండ్ల మీదికి వస్తోందని.. తమకెక్కడ వైరస్ వస్తుందోనని భయపడుతున్నారు. అలా రాదని అధికారులు చెప్పినా దహన సంస్కారాలను అడ్డుకుంటున్నారు. అంబర్ పేట, ఉప్పల్, రామంతాపూర్, సనత్ నగర్, అల్వాల్లోని గ్రేవ్ యార్డుల వద్ద ఇట్లాంటి ఘటనలు జరిగాయి. అంబర్ పేట లోని శ్మశాన వాటికలో మంగళవారం ఓ డెడ్ బాడీకి దహన సంస్కారాలు చేసేందుకు కాటి కాపరులు ముందుకు రాలేదని.. శ్మశాన వాటికలోని కట్టెలనూ ముట్టుకోనివ్వలేదని.. దీంతో బల్దియా సిబ్బంది కట్టెలు తెచ్చి దహనం చేశారని నిర్వాహకుడు వెల్లడించారు.

బల్డియా సిబ్బందితోనే అంతిమ సంస్కారాలు

శ్మశానాల్లో అంతిమ సంస్కారాలు సరిగా జరగని పరిస్థితి నెలకొంది. బల్దియా సిబ్బంది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం డెడ్ బాడీలను శ్మశానాలకు తరలిస్తున్నారు. కాటికాపరులు, సిబ్బంది వెనకడుగు వేస్తుండటంతో.. బల్దియా సిబ్బందే కట్టెలు పేర్చి దహనం చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల కరోనా డెడ్బాడీలను కాల్చేందుకు శ్మశాన వాటికల నిర్వహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దహన సంస్కారాలు చేసేందుకు అయ్యవార్లు ముందుకు రావడం లేదు. ఇక కొందరు చనిపోయాక కరోనా తేలుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల తిరుమలగిరిలో చనిపోయిన ఓ వ్యక్తికి దహన సంస్కారాలు పూర్తయ్యాక పాజిటివ్ అని తేలింది. ఆ వ్యక్తి కుటుంబంతోపాటు అంతిమ సంస్కారాలు చేసిన పంతులుకూ వైరస్ సోకింది. దీంతో సాధారణ మరణమని తేలితే తప్ప అంతిమ సంస్కారాలు చేయడం లేదని వారు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం