- గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అడ్డగోలు విభజన
- మూడు జిల్లాల్లోకి వెళ్లిన మండలాలు
- ప్రజలతో పాటు ఆఫీసర్లకు పాలనపరమైన ఇబ్బందులు
- రెవెన్యూ మంత్రి ప్రకటనతో దిద్దుబాటుపై ఆశలు
నిజామాబాద్,వెలుగు : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సరైన విధానం పాటించకుండా జిల్లా విభజన చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటు వేసేది ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాగా, ప్రభుత్వ పనుల కోసం మాత్రం మరో మండలం, డివిజన్, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. ఈ లోపాలన్నింటినీ సరి చేయడానికి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 6న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో నిజామాబాద్ జిల్లా విభజనలోని సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.
స్పష్టమైన ప్రమాణాలు లేకుండా విభజన..
36 మండలాలతో కొనసాగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను 2016లో ఎలాంటి స్పష్టమైన ప్రమాణాలు లేకుండా విభజించారు. 19 మండలాలతో నిజామాబాద్ జిల్లాను ప్రకటించి, కొత్తగా మరో 14 రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయడంతో 33 మండలాలకు సంఖ్య పెరిగింది. ఫలితంగా జిల్లాలో 33 మంది తహసీల్దార్లు ఉండగా, నిజామాబాద్ నార్త్, సౌత్ మండలాలు అర్బన్ మండలాలు కావడంతో అక్కడ ఎంపీడీవో ఆఫీస్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఎంపీడీవో ఆఫీస్‌లు 31కే పరిమితమయ్యాయి. ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన వికేంద్రీకరణ ప్రక్రియ కొత్త సమస్యలకు దారి తీసింది.
మూడు జిల్లాల్లోకి వెళ్లిన మండలాలు..
బోధన్ రెవెన్యూ డివిజన్‌లో, కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వర్ని, కోటగిరి, చందూర్, మోస్రా, రుద్రూర్, పోతంగల్ కలిపి ఆరు మండలాలు కొనసాగుతున్నాయి. దీంతో డివిజన్, అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా కేంద్రాలు వేర్వేరుగా మారి ప్రజలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి పథకాల రివ్యూ సమావేశాలు రెండు జిల్లాల్లో నిర్వహించాల్సి వస్తుండడంతో ప్రజలు అటూ ఇటూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ముగ్గురు ఎంపీటీసీలతో ఏర్పాటు చేసిన చందూర్, మోస్రా మండలాల్లో ఎంపీపీ ఎన్నిక వివాదాస్పదంగా మారడంతో 2020లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్మూర్ సెగ్మెంట్‌లోని మాక్లూర్ మండలం, బోధన్ సెగ్మెంట్‌లోని నవీపేట మండలం నిజామాబాద్ డివిజన్‌లో కొనసాగడం కూడా పాలనపరమైన సమస్యలకు కారణమవుతోంది.
సిరిసిల్ల జిల్లాలో మానాల గ్రామం..
విభజన సమయంలో బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కమ్మర్‌పల్లి మండలానికి చెందిన మానాల గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మార్చి సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కలిపారు. అసెంబ్లీ,
పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లా ఓటర్లుగా ఉన్న మానాల ప్రజలు, పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సిరిసిల్లా జిల్లా పరిధిలో కొనసాగాల్సి వచ్చింది. ఇది ప్రజలకే కాకుండా రాజకీయ పార్టీలకూ పెద్ద సమస్యగా మారింది.
దిద్దుబాటుపై ఆశలు..
కొత్తగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో ఈ సమస్యలన్నీ తొలగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన ప్రమాణాలతో పునర్విభజన చేపడితే పరిపాలన సులభతరం అవడంతో పాటు ప్రజలకు నిజమైన లాభం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.
