కొత్తగూడెం ‘కార్పొరేషన్’ ఎన్నికలు జరిగేనా?

కొత్తగూడెం ‘కార్పొరేషన్’  ఎన్నికలు జరిగేనా?
  • మున్సిపల్​కార్పొరేషన్​పై హైకోర్టులో పిటిషన్లు.. తీర్పు కోసం ఎదురుచూపులు
  • 27లోపు కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
  • ఎన్నికల ఏర్పాట్లలో ఆఫీసర్లు.. ఎన్నికలు ఉంటాయా, లేదా అని జోరుగా చర్చ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ ప్రభుత్వం గతేడాది కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ విలీన ప్రక్రియ శాస్త్రీయంగా లేదని, భౌగోళిక సరిహద్దులను పట్టించుకోలేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్​ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో, ఎన్నికల నిర్వహణపై నీలి నీడలు ముసురుకున్నాయి.

షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటంతోనే..  

ముఖ్యంగా పాల్వంచ మున్సిపాలిటీ షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. షెడ్యూల్డ్ ప్రాంతాలను మార్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటు సవరణ ద్వారానే సాధ్యమని, అలాంటప్పుడు అధికారులు పాల్వంచను కార్పొరేషన్‌‌లో ఎలా కలుపుతారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. దీనితో పాటు కొత్తగూడెం-పాల్వంచ మధ్యలో ఉన్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీలను, కొత్తగూడెం-సుజాతనగర్ మధ్యనున్న చుంచుపల్లి పంచాయతీలను వదిలేసి కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేశారని మరికొందరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

హైకోర్టులో వాదోపవాదాలు.. 

ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. షెడ్యూల్డ్ ఏరియా అంశంపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన కోర్టు, మిగిలిన పిటిషన్లకు సంబంధించి ఈ నెల 27వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు విచారణ కొనసాగుతుండటంతో ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేక మధ్యలో స్టే వస్తుందా అన్న ఉత్కంఠ నగర వాసుల్లో 
నెలకొంది. 

ఎన్నికల ఏర్పాట్లు యధాతథం..  

న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు మాత్రం తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఓటరు జాబితాను, 13న వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లను, 16న తుది జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.

మరో నాలుగు ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతుండగా, నోటిఫికేషన్ వచ్చినా కోర్టు స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొంటున్నారు. అధికారుల వేగం, కోర్టు ఆదేశాల మధ్య కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల భవితవ్యం తేలాల్సి ఉంది.