ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు చేరిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు చేరిన కరోనా మరణాలు
  • ఒక్క అమెరికాలోనే 5.8 లక్షల మంది మృతి
  • తర్వాత స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్
  • ప్రపంచంలో రోజూ సగటున 12 వేల మంది మృతి.. 7 లక్షలకు పైగా కొత్త కేసులు
  • దేశంలో కొత్తగా 2,34,692 మందికి వైరస్.. యాక్టివ్ కేసులు 16.79 లక్షలు..
  • 87.23 శాతానికి పడిపోయిన రికవరీ రేటు
  • ఢిల్లీలో టెస్టులు చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ 

న్యూఢిల్లీ: కరోనా మారణహోమం ఆగడం లేదు. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా బలయ్యారు. కరోనా మరణాలు అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 5.8 లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 6 డెత్స్​లో ఒకటి అమెరికాలోనే ఉంటోంది. తర్వాత బ్రెజిల్​లో 3.69 లక్షలు, మెక్సికోలో 2.11 లక్షలు, ఇండియాలో 1.75 లక్షలు, బ్రిటన్​లో 1.27 లక్షలు, రష్యాలో 1.05 లక్షల మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజూ సగటున 12 వేల మంది చనిపోతుండగా, 7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో ఒక్కరోజే 1,341 మంది మృతి
దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 2,34,692 మంది వైరస్ బారిన పడ్డారు. 1,341 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి, డెత్స్ సంఖ్య 1,75,649కి పెరిగిందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740కి చేరిందని చెప్పింది. గత 38 రోజులుగా యాక్టివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 87.23 శాతానికి పడిపోగా.. యాక్టివ్ కేసుల రేటు 11.56 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా 26.5 కోట్ల మందికి టెస్టులు చేశామని, శుక్రవారం ఒక్కరోజే 14.95 లక్షల శాంపిల్స్ పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది.

అన్నీ చోట్ల రికార్డు స్థాయిలో.. 
కొత్త కేసులు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో వచ్చాయి. మహారాష్ట్రలో 63,729, యూపీలో 27,426, ఢిల్లీలో 24 వేల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 398 మంది చనిపోగా, ఢిల్లీలో 141, చత్తీస్​గఢ్​లో 138, యూపీలో 103 మంది మృతి చెందారు. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం 10 రాష్ర్టాలు, యూటీల్లోనే నమోదువుతున్నాయి. 16 రాష్ట్రాలు, యూటీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయానికి 11,99,37,641 డోసులు పంపిణీ చేసినట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.

మే 1 తర్వాత కూడా ఆంక్షలు: మహారాష్ట్ర మంత్రి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్రలో విధించిన ఆంక్షలు.. మే 1 తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే చెప్పారు. అయితే కరోనా కేసుల తీవ్రతను బట్టి, ఈ 15 రోజుల్లో ఉండే పరిస్థితిని రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆక్సిజన్, బెడ్లు, రెమ్డెసివర్ కొరత: కేజ్రీవాల్
‘‘పరిస్థితి చాలా సీరియస్​గా ఉంది. ఆందోళన కలిగిస్తోంది. సిటీలో ఆక్సిజన్, బెడ్లు, రెమ్డెసివర్ కొరత ఎక్కువగా ఉంది.  24 గంటల్లోనే 24 వేల కేసులు రికార్డయ్యాయి” అని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 24 శాతంగా ఉంది. టెస్టులు చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. ‘‘కొన్ని రోజుల కిందటి వరకు అంతా బాగుండేది. కానీ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్నింటి కొరత వేధిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. కరోనా పీక్ స్టేజ్​కు వెళ్తే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు” అని కేజ్రీవాల్ హెచ్చరించారు. బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, రెండు నుంచి నాలుగు రోజుల్లో మరో 6  వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.