
- చోరీ చేసేదంతా కారు టైర్లనే.. ఖరీదైన కార్లే టార్గెట్
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు
- రూ.2 లక్షల నగదు.. 68 కారు టైర్లు స్వాధీనం
హైదరాబాద్: కరోనా ప్రభావంతో ఉపాధి కరువైన ఇద్దరు యువకులు చోరీల బాట పట్టారు. పోలీసు కేసుల్లేకుండా చేసుకునేందుకు వారు కారు టైర్లు మాత్రమే చోరీలు చేస్తూ వచ్చారు. గత ఆరు నెలలుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 చోట్ల నిలిచిఉన్న కారు టైర్లను మాయం చేశారు. ఎక్కువ ధర వస్తుందనే ఆశతో వారు ఖరీదైన కార్ల టైర్లనే టార్గెట్ చేసుకున్నారు. పోలీసులకు దొరకకుండా తాము వాడుతున్న స్విఫ్ట్ కారు నెంబర్ ప్లేట్ తరచూ మారుస్తూ.. చోరీలు చేశారు. లక్షల సీసీ కెమెరాలున్న హైదరాబాద్ మహా నగరంలో ఈ టైర్ల దొంగలెవరు ఆకతాయిల పనేమోనని అనుమానం కలిగింది. వరుసగా జరుగుతుండడంతో పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో తమను చికాకు పెడుతూ.. కార్ల యజమానులను ఇబ్బందిపెడుతున్న దొంగలెవరో తేల్చేందుకు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితులను ఆరా తీయగా.. ఆరు నెలల్లో 29 చోట్ల చోరీలు చేసినట్లు తేలింది. ముఖ్యంగా రాచకొండ కమీషనరేట్ పరిధిలో గత ఆరు నెలలుగా రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన ఖరీదైన కార్ల వీల్ డెస్క్, టైర్లను దొంగతనం చేస్తూ.. పోలీసులకు దొరకుండా తప్పించుకు తిరుగుతున్నారు. నేరుగా అమ్మితే పట్టుపడతామని దొంగలించిన కారు టైర్లను ఓఎల్‌ఎక్స్ లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇద్దరు నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వీరి నుండి రెండు లక్షల నగదుతో పాటు డెక్స్ లతో కూడిన 47 కాస్లీ కార్ల టైర్లు, ఒక కారును ను స్వాదీనం చేసుకున్నారు.ఎల్బీ నగర్ లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో ఎల్బీ నగర్ డిసిపి సంప్రీత్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి కి చెందిన మోతే శ్రీకాంత్, గుల్లమ్ బాలకిషన్ అనే ఇద్దరు కోవిడ్ తర్వాత పూర్తిగా ఆర్ధిక ఇబ్బందుల్లోకి వెళ్లారు.ఆ ఇబ్బందుల నుండి బయట పడేందుకు శ్రీకాంత్ కు చెందిన స్విఫ్ట్ కారుకు తరుచూ నంబర్ ప్లేట్ లు మారుస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా ఆరు నెలల వ్యవధిలో ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 29 చోట్ల చోరీలు చేసి మొత్తం 68 టైర్లు చోరీ చేశారు.ఇలా చోరీ చేసిన ప్రతీసారి నంబర్ ప్లేట్ మారుస్తూ పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. అయ్యింది చిన్న దొంగతనమే అయినా ఇవి రోజు రోజుకూ ఎక్కువగా అవ్వడంతో ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు వీరిని పట్టుకునేందుకు చాలానే కష్టపడ్డారు. ఎట్టకేలకు సీసీ కెమెరాల ద్వారా దొరికిన ఆధారాలతో ధర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాదీనం చేసుకున్నారు.