మాస్కులు, శానిటైజర్లపై కేంద్రం కీలక నిర్ణయం

మాస్కులు, శానిటైజర్లపై కేంద్రం కీలక నిర్ణయం

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, శానిటైజర్లను అత్యవసర వస్తువులుగా గుర్తిస్తూ వాటి ధరలపై నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రెండు లేయర్లు, మూడు లేయర్ల మాస్కుల రిటైల్ సేల్ ధరలు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఉన్న ధరలను యథావిధిగా కొనసాగించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2 లేయర్ల మాస్కు ఒకటి రూ.8 దాటడానికి లేదని స్పష్టం చేసింది. మూడు లేయర్ల మాస్కు ఒకటి రూ.10 కంటే ఎక్కువ అమ్మకూడదని తెలిపింది. లేదా ఫిబ్రవరి 12న నాటి ధరలు ఇంకా తక్కువగా ఉంటే ఆ ప్రకారమే అమ్మాలని సూచించింది.

200 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ రూ.100 కంటే ఎక్కువ అమ్మకూడదని కేంద్రం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ 30 వరకు అమలులో ఉంటుందని, ఆ రోజు వరకు ఇవే ధరలతో మాస్కులు, శానిటైజర్లు అమ్మాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం సెక్షన్-3 ప్రకారం కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.