నేటి నుంచి రాష్ట్రంలో పవర్‌ఫుల్ చట్టం అమలు.. నన్ను దింపేసి.. నా కారు కూడా లాక్కెళ్లొచ్చు

నేటి నుంచి రాష్ట్రంలో పవర్‌ఫుల్ చట్టం అమలు.. నన్ను దింపేసి.. నా కారు కూడా లాక్కెళ్లొచ్చు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మార్చి 31 వరకు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి ఈ మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు. అయితే ఈ విపత్కర సమయంలో ఎవరైనా ప్రభుత్వానికి సహరించకుంటే కఠినచర్యలు తీసుకుంనేందుకు వీలుగా బ్రిటిష్ కాలం నాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897ను అమలులోకి తెస్తున్నామని ఆయన ప్రకటించారు.

నన్ను దింపేసి.. నా కారు కూడా తీసుకెళ్లే పవర్

సీఎస్ కింద కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ఎపిడమిక్ చట్టం అమలులోకి రావడంతో కలెక్టర్లకు ఫుల్ పవర్స్ వస్తాయన్నారు. అత్యవసర పరిస్థితి అనిపిస్తే తాను ఎక్కడికైనా వెళ్తుండగా ఆపేసి.. తన కారును సైతం తీసుకుని సహాయ చర్యలు చేపట్టే అధికారం కలెక్టర్లకు ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

గతంలో ఎపిడమిక్ డిసీజ్ చట్టం అమలు..

– అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ యాక్ట్ అమల్లోకి తెస్తారు.

– 2018 లో మలేరియా కోసం ప్రబలినప్పుడు గుజరాత్‌లో ఈ చట్టాన్ని వాడారు.

– 2015లో చండీగఢ్‌లో డెంగ్యూ వచ్చినప్పుడు, 2009లో పూణేలో స్వైన్‌ ఫ్లూ విజృంభించినప్పుడు దీన్ని అమలులోకి తెచ్చారు.

చట్టం అధికారాలివే

– రాష్ట్రంలో నేటి నుంచి ఏడాది పాటు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ – 1897 అమలులో ఉంటుంది.

– ఈ చట్టం కింద నిబంధనలు, అధికారాలను ‘తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ (కోవిడ్-19)’ రెగ్యులేషన్ అని విడుదల చేసింది.

– పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విద్యా పరిషత్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లకు వారి పరిధిలో కరోనా నియంత్రణకు నిర్ణయాలు తీసుకునే అధికారం.

– కరోనా లక్షణాలున్న వారిని ప్రభుత్వం నోటిఫై చేసిన ఆస్పత్రుల్లో మాత్రమే చేర్చుకోవాలి.

– అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు.

– ప్రభుత్వానికి సహకరించని వారిపై కేసులు కూడా పెట్టొచ్చు.

– ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.

– నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.