ఏపీలోని ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

ఏపీలోని ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

అమరావతి: ఏపీలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో అన్నదానం (పంక్తి భోజనాలకు) బదులు ఆహారం ప్యాకెట్లు అందించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేవాదాయశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అన్నదాన సత్రాల్లో సహ పంక్తి భోజనాలను వెంటనే నిలిపివేస్తూ.. భక్తుల భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.భోజనం ప్యాకెట్లో సాంబారు అన్నం, దద్దోజనం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంతోపాటు శ్రీశైలం, ద్వారకా తిరుమల, తదితర ఆలయాల్లో సోమవారం నుండి అన్నదానాన్ని (పంక్తి భోజనాలను) నిలిపివేయాలని నిర్ణయించారు. అన్నదానం ఆగిపోయినా ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా భోజనం ప్యాకెట్లను అందిస్తారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. శ్రీశైలంలోని అన్నపూర్ణ సత్రం సోమవారం నుండి పంక్తి భోజనాలను నిలిపివేసి భోజనం ప్యాకెట్ల పంపిణీ ప్రారంభించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా పులిహోర, పెరుగన్నం, సాంబారన్నంతోపాటు నీళ్ల ప్యాకెట్ల పంపిణీ చేస్తామని  దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, అన్నపూర్ణ సత్రం ఇంచార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించేలా భక్తులకు నిరంతరం సూచనలు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరించేలా చేస్తున్నామని వారు వివరించారు.