పెండ్లి విందులో కొత్త మార్పు

పెండ్లి విందులో కొత్త మార్పు

పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేసినా.. అందరూ మాట్లాడుకునేది ఫుడ్​ గురించే. ‘చాలా వెరైటీలు పెట్టారు.. మటన్‌ కర్రీ ఎంత బాగుందో!.. గుత్తి వంకాయ కూర ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది’.. ఇవే ముచ్చట్లు వినిపిస్తుంటాయి. అందుకే టేస్టీ ఫుడ్‌ పెడితేనే గుర్తింపు వస్తుందని పెద్దలు అంటుంటారు. అయితే..ఇప్పుడు టేస్ట్‌ ఒక్కటే కాదు, ఫుడ్‌ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటున్నారు.   కరోనా వల్ల అందరికీ హెల్త్‌ కాన్షియస్‌ పెరిగింది. పెళ్లి విందులో కూడా ఇమ్యూనిటినీ పెంచే ఫుడ్‌కే
ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే అందరూ గ్రాండ్‌ అండ్‌ హెల్దీ వెడ్డింగ్‌ మెను ఉండాలంటున్నారు.

పెళ్లి భోజనంలో టేస్ట్ ఇంపార్టెంట్. వచ్చినవాళ్లందరూ రుచుల గురించే మాట్లాడుకుంటారు. అయితే కోవిడ్ వల్ల ఇప్పుడు టేస్ట్‌‌తోపాటు ‘ఇమ్యూనిటీ’ ఇస్తుందా? లేదా? అని ఆలోచిస్తున్నారు. లాక్‌‌డౌన్‌‌లో పోస్ట్‌‌పోన్ అయిన మ్యారేజ్‌‌లు ఇప్పుడు జరుగుతున్నాయి. లిమిటెడ్ క్రౌడ్‌‌తో  తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి ఫుడ్, మ్యారేజ్ హాల్ వరకు అన్ని చోట్ల ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్‌‌‌‌తో పాటు మెనులో ఇమ్యూనిటీ పెంచే రెసిపీలను యాడ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వెడ్డింగ్ మెనూ టేస్టీ విత్ హెల్దీగా మారిపోయింది.

హాట్ అండ్ హెల్దీ గా..

కూల్ ఐటమ్స్ కంటే హాట్‌‌హాట్‌‌గా ఉండే ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ఎంట్రన్స్‌‌లో ఇచ్చే జ్యూస్, డ్రింక్స్ కూడా డ్రై ఫ్రూట్స్‌‌తో చేసినవే ఉంటున్నాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్స్ కాకుండా డ్రై ఫ్రూట్ డిసర్ట్స్, స్వీట్స్ పెడుతున్నారు. మెయిన్ మెనులో ఇమ్యూనిటీ పెంచేందుకు కూరల్లో పసుపు ఎక్కువగా వాడుతున్నారు. టర్మరిక్ స్పెషల్ కిచిడీలు, బీట్ రూట్, మిరియాలు, అల్లం, కొబ్బరితో చేసిన డిసర్ట్స్, సలాడ్స్, పులావ్‌‌లు అందిస్తున్నారు. సూప్‌‌ల్లో కూడా అల్లం, మిరియాలు ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ క్యాటరింగ్ వాళ్లు వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. అలాగే టేబుల్ సిస్టమ్‌‌లో డిస్టెన్స్ ఉండేలా ఆరడుగుల దూరంలో టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. ప్రతి టేబుల్‌‌కి ఇద్దరు లేదా ముగ్గుర్ని కూర్చొబెడుతున్నారు.

కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ…

వెడ్డింగ్ ప్యాకేజిలో భాగంగా గెస్ట్‌‌లకు ఈ-– ఇన్విటేషన్ కార్డ్స్ పంపడం, బ్రైడల్ మేకప్, మెహంది ఆర్టిస్ట్, ఫొటో బూత్, కార్ డెకరేషన్, మండపం, సన్నాయి మేళం, ఫుడ్, సౌండ్ సిస్టం, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఫొటో ఆల్బమ్ తో పాటు గెస్ట్‌‌లకు థర్మల్ స్క్రీనింగ్, యూవీ హ్యాండ్ శానిటైజేషన్ స్టేషన్, ఎన్ 95 మాస్క్‌‌లు, కడల్ కర్టెన్స్, ఆర్టిస్ట్ మేనేజ్‌‌మెంట్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మండపం డెకరేషన్‌‌కి వచ్చే లేబర్స్‌‌కి షూస్, మాస్క్‌‌లు, గ్లౌజ్‌‌లు వంటివి ప్రొవైడ్ చేసి వాళ్లకు సెపరేట్ ప్లేస్ ఇస్తున్నారు. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌‌కి మాస్క్‌‌లు, గ్లౌజ్‌‌లు ఇస్తున్నారు. ప్రతి గెస్ట్ అరగంటకు ఒకసారి హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి అని అనౌన్స్‌‌ చేస్తున్నారు. మండపం మీద కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరు ఉండకుండా చూస్తున్నారు.

ప్లానింగ్ ఛేంజ్ చేశాం

ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తున్నాయ్. రెండు వందల వరకు వస్తున్నారు. కరోనా వైరస్ వల్ల మేం మా ప్లానింగ్ ఛేంజ్ చేశాం. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు లిమిటెడ్ టీంతో అన్ని అరేంజ్‌‌మెంట్స్ చేస్తున్నాం. డెకరేషన్ నుంచి కేటరింగ్ వరకు ప్రతీది నీట్‌‌గా ఫినిష్ చేస్తున్నాం. మేం చేసేవి హైరేంజ్ వెడ్డింగ్స్. హాల్ డెకరేషన్, సౌండ్ సిస్టం, ఫొటోలు, వీడియోలు, క్యాటరింగ్ మొత్తం మేమే చూసుకుంటాం. కోవిడ్ వల్ల వెడ్డింగ్ ప్లానర్స్ తమ ఐడియాలజీని చాలానే మార్చుకున్నారు. ఆర్డర్‌‌‌‌లో భాగంగా మాస్క్‌‌లు, శానిటైజర్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే గెస్ట్‌‌లు వచ్చినప్పటి నుంచి ఎలా ఉండాలో సజెస్ట్‌‌ చేస్తున్నాం. ఇక ఫుడ్ విషయానికొస్తే సెపరేట్‌‌గా బాక్స్‌‌ల్లో పెట్టి ఇస్తున్నాం. వెజ్, నాన్ వెజ్ వేరువేరుగా ప్యాక్‌‌ చేసి బాక్స్‌‌లపై రాసి గెస్ట్‌‌ల టేబుల్ దగ్గరకే పంపిస్తున్నాం. వెల్ కమ్ డ్రింక్ నుంచి మెయిన్ మెనూ వరకు ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఐటమ్స్ ఉండేలా చూస్తున్నాం.–అరుణ్, వెడ్డింగ్ ప్లానర్, వజ్ర ఈవెంట్స్.