బట్ట బయటకెళ్తలేదు!

బట్ట బయటకెళ్తలేదు!

స్కూళ్ల బంద్​తో రూ.72 కోట్ల ఆర్వీఎం ఆర్డర్ల రద్దు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కరోనా దెబ్బ పడింది. నిన్న మొన్నటివరకు బతుకమ్మ, ఆర్వీఎం, ఇతర ఆర్డర్లతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఈసారి రూ.72 కోట్ల విలువైన 1.5 కోట్ల మీటర్ల వస్త్రం ఆర్వీఎం ఆర్డర్లు సర్కార్​ సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. కానీ కరోనా కారణంగా స్కూళ్లు బంద్​కావడంతో ఈసారి సర్కార్​ బడుల్లో యూనిఫాంల పంపిణీ జరిగే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆర్వీఎం ఆర్డర్లను 30 రోజుల అనంతరం టెస్కో రద్దు చేసింది. ఈ 30 రోజుల వ్యవధిలో సిరిసిల్ల ఆసాములు రూ.15 కోట్ల నూలు కొనుగోలు చేశారు. సుమారు రూ. 2 కోట్ల విలువైన వస్త్రం కూడా తయారు చేశారు. ఇంకా రూ.13 కోట్ల యార్న్​నిల్వలు, ఆర్వీఎం కోసం తయారు చేసిన వస్త్రం పేరుకుపోయాయి. మరోవైపు మహారాష్ట్రలో లాక్​డౌన్​కారణంగా బతుకమ్మ చీరలకు సంబంధించిన ముడిసరుకులు, ఆధునిక సామగ్రి రాలేదు. దీంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి నిలిచిపోయింది. నూలు నిల్వ ఉన్నంతలో 14 వేల డాబీ సాంచెలకు గాను కేవలం 2 వేల సాంచెలు మాత్రమే ప్రారంభమయ్యాయి. డాబీ సాంచెలకు టెక్నిషియన్లు కూడా మహారాష్ట్ర నుంచి రావాల్సి ఉండగా లాక్​డౌన్​కారణంగా రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్తంభించిపోయింది. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన 25 వేల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
అందని బకాయిలు.. ఆర్డర్ల రద్దు
బతుకమ్మ చీరల కాకుండా.. జనరల్​గా తయారు చేసే వస్త్రాలకు కరోనా కారణంగా మార్కెటింగ్​ లేక ఎగుమతులు నిలిచిపోయాయి. ఇలా రూ.55 కోట్ల విలువైన వస్త్ర నిల్వలు సిరిసిల్లలో పేరుకుపోయాయి. ఇందులో పాలిస్టర్​రూ. 30 కోట్లు, కాటన్​రూ. 25 కోట్ల వస్త్రం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గోదాముల్లో ఉన్న వస్త్రాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరుకుతుండడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 2021 ఆర్వీఎం ఆర్డర్లు రద్దు చేసిన సర్కారు 2020లో తీసుకున్న ఆర్వీఎం ఆర్డర్లకు సంబంధించిన రూ.11 కోట్ల బకాయిలు పెండింగ్​లో పెట్టింది. ఇటు కొత్త ఆర్వీఎం ఆర్డర్లు ఇవ్వక, అటు పాత బకాయిలు విడుదల చేయకపోవడంతో సిరిసిల్ల ఆసాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
నేతన్నలపై కరోనా పంజా
సిరిసిల్ల నేతన్నలపై కరోనా పంజా విసురుతోంది. నెల రోజుల్లో సిరిసిల్లలో 1,000 మందికి పైగా కరోనా బారిన పడి ఉపాధికి దూరమయ్యారు. చాలామంది హోం క్వారంటైన్​లో ఉంటుండగా.. మరికొందరు సిరిసిల్ల సర్కార్​దవాఖానలో ట్రీట్మెంట్​పొందుతున్నారు.