
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో కలవరం
మహదేవపూర్, వెలుగు: ఒకే ఊర్లో 9 రోజుల్లో 28 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సర్పంచ్ సహా మరికొంత మందికి కరోనా నిర్ధారణ అయింది. ఊర్లో చిరుతల రామాయణం ప్రదర్శించగా, జనం పెద్ద ఎత్తున రావడంతో వైరస్ అంటుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామంలో ఈ నెల 15 నుంచి 20 వరకు చిరుతల రామాయణం ప్రదర్శించారు. దాన్ని చూడ్డానికి ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచీ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఈ నెల 22న ఊర్లోని హైస్కూల్ లో ర్యాండమ్‌గా టెస్టులు చేయగా టెన్త్ క్లాస్ అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టి టెస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం వరకు 198 మందికి టెస్టు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చింది. కాగా, డీఎంహెచ్ ఓ సుధార్‌సింగ్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఇంటింటికీ తిరిగి పేషెంట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.