‘క‌రోనా ఫ్రీ స్టేట్’లో మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

‘క‌రోనా ఫ్రీ స్టేట్’లో మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు

క‌రోనా పేషెంట్లంతా డిశ్చార్జ్ కావ‌డంతో క‌రోనా ఫ్రీ స్టేట్ గా మారిన త్రిపుర‌లో మ‌ళ్లీ మూడు రోజులుగా కొత్త‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. తొలుత క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారంతా కోలుకుని డిశ్చార్జ్ కావ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ మ‌ళ్లీ వైర‌స్ విజృంభిస్తుండ‌డంతో ఆ రాష్ట్ర స‌ర్కారుతో పాటు, ప్ర‌జ‌లు కూడా ఆందోళ‌న చెందుతున్నారు.

ఏప్రిల్ తొలి వారంలో త్రిపుర‌లో రెండు క‌రోనా కేసులు న‌మోదు కాగా.. చికిత్స త‌ర్వాత‌ వారిద్ద‌రూ పూర్తిగా కోలుకుని ఏప్రిల్ 16న డిశ్చార్జ్ అయ్యారు. వారం త‌ర్వాత ఏప్రిల్ 23న త్రిపుర క‌రోనా ఫ్రీ స్టేట్ గా మారిందంటూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్ కుమార్ దేవ్ ప్ర‌క‌టించారు. అయితే శ‌నివారం నాడు మ‌ళ్లీ ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వారికి అగ‌ర్త‌ల లోని జీబీ పంత్ హాస్పిట‌ల్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే వారు దానికి అంబాసాలోని ప్ర‌భుత్వాస్ప‌త్రిలో తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో కొద్ది రోజుల‌పాటు చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అగ‌ర్త‌ల‌కు త‌ర‌లించ‌డ‌గా అక్క‌డ అనుమానంతో క‌రోనా టెస్టు చేయ‌గా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తొలుత చికిత్స పొందిన ఆస్ప‌త్రి స్టాఫ్, వారితో కాంటాక్ట్ అయిన వారంద‌రినీ, ఇత‌ర అనుమానితుల‌ను గుర్తించి నిన్న టెస్టులు చేశారు. వారిలో మ‌రో 25 మంది పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29కి చేర‌గా.. వారిలో ఇప్ప‌టికే ఇద్ద‌రు డిశ్చార్జ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు ఆరోగ్య శాఖ అధికారులు. ప్ర‌స్తుతం 27 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు.

దేశంలో మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 46,711కి చేరింది. అందులో 1583 మంది మ‌ర‌ణించ‌గా, 13,161 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 14541, గుజ‌రాత్ లో 5804, ఢిల్లీలో 4898 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక త‌మిళ‌నాడులో 3550, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 3049, రాజ‌స్థాన్ లో 3061, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 2859 మందికి వైర‌స్ సోకింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 1717, పశ్చిమ బెంగాల్ లో 1259, పంజాబ్ లో1233, తెలంగాణ‌లో 1085 కేసులు న‌మోద‌య్యాయి. ఇక అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, గోవా, మ‌ణిపూర్ ల‌లో కరోనా బారిన‌ప‌డిన వారంతా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావ‌డంతో ఆ మూడు రాష్ట్రాలు ప్రస్తుతం క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా ఉన్నాయి.