హైదరాబాద్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా

హైదరాబాద్ లో మళ్లీ  పెరుగుతున్న కరోనా

హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో ఏకంగా స్కూళ్లు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు, పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూ చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో నగర వాసుల్లో మాత్రం అజాగ్రత్త పెరిగిపోతోంది. పబ్లిక్ ప్లేసుల్లో కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. కొందరు మాస్క్ పెట్టుకున్నా.. మొహానికి ఫుల్ కవర్ అయ్యేలా ఉండట్లేదు. ఇలా చేస్తే కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం.. నోటి తుంపర్ల ద్వారా ప్రధానంగా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పటిప్పుడు హ్యాండ్ శానిటైజ్ వాడటం, మొహనికి మాస్క్ ధరించడం మస్ట్. కానీ ప్రజల్లో ఇప్పటికీ అజాగ్రత్త కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం కరోనా వచ్చిన కొత్తలో పబ్లిక్ చాలా జాగ్రత్తలు పాటించారు. మాస్క్ లు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించారు. కానీ ఇప్పుడవి అస్సలు పాటించడమే లేదు. వ్యాక్సిన్ వేసుకున్నమానే ధీమా కొందరిలో ఉంటే.. మనకు కరోనా రాదులే అనే నిర్లక్ష్య ధోరణి మరికొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో రైతు బజార్లు, గల్లీ మార్కెట్ లు, షాపింగ్ ఏరియాల్లో గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారు. నో మాస్క్-నో ఎంట్రీ బోర్డులను కూడా లైట్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటం, మరోవైపు ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ వచ్చి లాక్ డౌన్ ఎక్కడ పెడతారో అనే భయం వ్యాపారుల్లో ఆందోళన ఉంది. మళ్లీ లాక్ డౌన్ పెడితే తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం నుంచి మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్ వేయాలనే ఆర్డర్స్ ఉన్నా.. అమలు చేయడంలో అధికారులు, పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో జనం కూడా మాస్క్ వినియోగాన్ని లైట్ తీసుకుంటున్నారు.