టూరిస్ట్ గైడ్ ల పై కరోనా తీవ్ర ప్రభావం

టూరిస్ట్ గైడ్ ల పై కరోనా తీవ్ర ప్రభావం

టూరిస్ట్ గైడ్ ల పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. కరోనాకు ముందు పర్యాటక ప్రాంతాలు బిజీగా ఉండడంతో వీరికి ఉపాధి దొరికేది. అయితే లాక్ డౌన్ తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకున్నా …సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో జనం పెద్దగా రావడం లేదు. దీంతో టూరిజంపై ఆధారపడిన గైడ్ ల పరిస్థితి దారుణంగా తయారైంది.

హెరిటేజ్ సిటీగా పేరున్న హైదరాబాద్ నగరంలో..పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వీటిపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. వీళ్ళల్లో టూరిస్ట్ గైడ్ లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. టూరిస్ట్ ప్రాంతాల చరిత్ర, ఇతర అంశాలను పర్యాటకులకు వివరిస్తుంటారు గైడ్ లు. అయితే కరోనా మహమ్మారి వీరి జీవితాలను తలకిందులు చేసింది. లాక్ డౌన్ తో ఆరు నెలలుగా టూరిస్ట్ ప్లేస్ లు మూతపడ్డాయి. దీంతో టూరిజాన్నే వృత్తిగా ఎంచుకున్న గైడ్ లు ఇళ్లకే పరిమితమయ్యారు. చేసేందుకు పనులు లేక…ఇబ్బందులు పడుతున్నారు.

సిటీలోని హెరిటేజ్ కట్టడాలు, సంప్రదాయ పండుగలు, పార్కులు, ఇతర పర్యాటక ప్రాంతాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. సిటీలోని షాపింగ్, ఫుడ్, కల్చర్ నచ్చి వచ్చేవాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. వీరికి మన ప్రాంత విశిష్టత, చరిత్ర, ఇతర విషయాలు వివరిస్తుంటారు టూరిస్ట్ గైడ్స్. రోజూ ఉదయాన్నే పర్యాటక ప్రాంతాలకు చేరుకుని…అతిధులకు సాయపడతారు. కానీ ప్రస్తుత పరిస్థితితో పర్యాటక ప్రాంతాల్లో జనం సందడి తగ్గింది. కరోనాతో ఎవరూ రావడం లేదు. విదేశీ విమాన సర్వీసులు కూడా పూర్థిస్థాయిలో నడవకపోవడంతో టూరిజం ప్రాంతాలు వెల వెల బోతున్నాయి. టూరిస్టులు లేకపోవడంతో ఏళ్లుగా సిటీ చరిత్ర వివరిస్తూ…కుటుంబాలను పోషిస్తున్న గైడ్ ల బతుకులు ఆగమవుతున్నాయి. పొట్టకూటికోసం ఇతర పనులను వెతుక్కుంటున్నారు. టూరిస్టులు వచ్చినప్పుడు రోజుకు 800 నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్లమంటున్నారు గైడ్ లు. ప్రస్తుతం పర్యాటకులు తగ్గడంతో…మూడు రోజులకు కలిపి 500 కూడా రావట్లేదంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.