చనిపోయాక కరోనా అని తేలింది

చనిపోయాక కరోనా అని తేలింది

తంగళ్లపల్లి, వెలుగు: కరోనా లక్షణాలున్న 54 ఏళ్ల ఓ మహిళను శాంపిల్ ఇచ్చాక ఇంటికి వెళ్లేందుకు డాక్టర్లు అనుమతించటంతో ఆ మరుసటి రోజే ఆమె చనిపోయింది. కరోనా శాంపిల్స్ ఇచ్చాక రిజల్ట్స్ వచ్చే వరకు హాస్పిటల్ లోనే ఉంచాల్సినప్పటికీ డాక్టర్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సదరు మహిళ కూడా జ్వరం లేకపోవటంతో తనకేం కాదన్నట్లుగా హాస్పిటల్ లో ఉండకుండా ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఆ మరుసటి రోజే ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇంటి వద్దే కుప్పకూలి చనిపోయింది. ఆదివారం కరోనా శాంపిల్ ఇచ్చిన ఆ మహిళ సోమవారం మృతి చెందారు. బుధవారం వచ్చిన రిజల్ట్స్ లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన మహిళ హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఇస్త్రీ పనిచేస్తుండే. పది రోజుల క్రితమే సొంతూరు కస్బెకట్కూర్ కు వచ్చిన ఆమెకు జలుబు, దగ్గు ఉండటంతో ఓ ఆర్ఎంపీ వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంది. అయినా తగ్గకపోవటంతో సిరిసిల్ల ఏరియా దవాఖానాకు వెళ్లింది. ఇక్కడ ఎక్స్ రే, ఈసీజీ తో పాటు కరోనా శాంపిల్ తీసుకున్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు హాస్పిటల్ లో ఉండాలని చెప్పిన అందుకు మహిళ అంగీకరించలేదు. సోమవారం జలుబు, దగ్గు తీవ్రం కావటంతో మళ్లీ హాస్పిటల్ కు వచ్చింది. ఊపిరితిత్తుల్లో నంజు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు పరిస్థితి బాగాలేదని హాస్పిటల్ లో ఉండమన్నా జ్వరం లేదుగా అంటూ మళ్లీ ఇంటికి వెళ్లిపోయింది. కాసేపటికే ఇంటివద్ద కుప్పకూలి చనిపోయింది. బుధవారం వచ్చిన రిజల్ట్ లో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలటంతో గ్రామస్తులు, డాక్టర్లు, అంత్యక్రియలకు హాజరైన వారు, కాంటాక్ట్ అయిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

హాస్పిటల్ లో ఉంటే ప్రాణాలు దక్కేవేమో!

ఈ ఘటనలో డాక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కరోనా లక్షణాలున్న మహిళను హాస్పిటల్ లోనే ఉంచితే, రిజల్ట్స్ వచ్చే వరకు అబ్జర్వేషన్ లో పెట్టి ఉంటే చనిపోయేది కాదంటున్నారు. శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆ మహిళ పలువురిని కలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దగ్గర్లోని గండి లచ్చపేట్ గ్రామంలో ఓ పెండ్లికి కూడా హాజరైనట్లు గుర్తించారు. పెళ్లి జరిగిన వాడను మూసేశారు. కస్బెకట్కూర్, గండిలచ్చపేట్ గ్రామాల్లో శానిటైజ్ చేశారు.