వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీక్!

V6 Velugu Posted on Aug 03, 2021

  • మనుషులకు సోకేలా వైరస్ ను చైనా సైంటిస్టులు మాడిఫై చేసిన్రు 
  • యూఎస్ రిపబ్లికన్ నేతల రిపోర్ట్ 

వాషింగ్టన్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రకటించారు. వుహాన్ ఇనిస్టిట్యూట్ఆఫ్​వైరాలజీలో కరోనా వైరస్ లను మనుషులకు సోకేలా మాడిఫై చేసే ప్రయోగాలు జరిగాయని వారు స్పష్టం చేశారు. వైరస్ లను మాడిఫై చేయడంతో పాటు ఆ విషయాన్ని ఎవరూ గుర్తించకుండా చేయడంపై చైనీస్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారనేందుకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని ఈ మేరకు వారు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ రిపబ్లికన్ సభ్యుడు, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చీఫ్ మైక్ మెక్ కౌల్ ఈ రిపోర్టును సోమవారం విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మందిని బలితీసుకున్న కరోనా మహమ్మారి పుట్టుకపై ద్వైపాక్షిక విచారణ జరగాల్సిందేనని రిపోర్టులో డిమాండ్ చేశారు. వుహాన్ లోని జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందన్న వాదనను పూర్తిగా తిరస్కరించాల్సిన టైం వచ్చిందని రిపోర్టు తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి 2019, సెప్టెంబర్ 12కు ముందే కరోనా లీక్ అయిందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. 

ఎటూ తేల్చని సీఐఏ.. 
కరోనాను మనుషులు జెనెటికల్ గా మాడిఫై చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్న సైంటిస్టుల అభిప్రాయాన్ని తాము అంగీకరిస్తున్నామని యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) గత ఏప్రిల్ నెలలో ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. కానీ కరోనా పుట్టుకపై అమెరికా సైంటిస్టుల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కరోనా పుట్టుకపై 90 రోజుల్లో సమగ్ర రిపోర్టును ఇవ్వాలంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గత మే నెలలో సీఐఏను ఆదేశించారు. అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపించిందా? లేక వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందా? అన్న విషయంలో సీఐఏ ఇప్పటివరకూ ఒక నిర్ణయానికి రాలేదని చెప్తున్నారు.

Tagged america, coronavirus, China, Wuhan Lab, CIA, US republican leaders

Latest Videos

Subscribe Now

More News