తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాను బాగా కంట్రోల్ చేశామని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజలంతా లాక్ డౌన్ కు మంచిగా సహకరిస్తున్నారని, మరికొన్నాళ్లు ఓపిక పడితే ఈ మహమ్మారి నుంచి బయటపడుతామని అన్నారు. ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు 70 రోజుల పాటు కంట్రోల్ చేయగలిగితే దానిని పూర్తిగా కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ చర్చించింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా మీడియాకు వెల్లడించారు. గతంలో మే 7 వరకు లాక్ డౌన్ ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్ నేడు దానిని మరో 22 రోజులు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. యథావిధిగా రాత్రి ఏడు గంటల నుంచి రాష్ట్రమంతా కర్ఫ్యూ కొనసాగగుతుందని చెప్పారు.
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆంక్షల సడలింపు
మొదటి నుంచి రాష్ట్రంలో పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని అన్నారు కేసీఆర్. ప్రజలంతా భౌతిక దూరం పాటించి మరికొన్నాళ్లు స్వీయ నియంత్రణతో ముందుకు సాగాలని కోరారు. కష్టపడి పని చేసిన పోలీసులు, డాక్టర్లు, పారివుద్య కార్మికులకు అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లు పాటించిన జాగ్రత్తలనుఇంకొన్నాళ్లు కొనసాగించాలన్నారు. కేసులు భారీగా తగ్గుతున్నాయని, క్రమంగా జీరోకి తీసుకురావాలని అన్నారు. కొద్ది రోజులుగా కేసులు కేవలం హైదరాబాద్ లో మాత్రమే వస్తున్నాయని చెప్పారు. కేంద్రం లాక్ డౌన్ లో సడలింపులు ప్రకటించిందని, వాటిని యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ షాపులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, కానీ మన రాష్ట్రంలో ఏవీ తెరవడానికి లేదన్నారు. నిర్మాణ పనులు తప్ప ఎటువంటి షాపులు తెరవడానికి లేదన్నారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయని, మిగిలిన 27 జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్లలోకే వస్తాయని చెప్పారు.
