
కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కనీవినీ ఎరుగని రీతిలో ఈ వైరస్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. ఇప్పుడప్పుడే ఈ వైరస్ ను పూర్తిగా తరిమికొట్టలేమని, రానున్న రోజుల్లో దానిని ఎదుర్కొంటూనే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు. కరోనా లాక్ డౌన్ పై దేశ ప్రజలనుద్దేశించి మంగళవారం రాత్రి ఆయన ప్రసంగించారు. దేశంలో మే 17 తర్వాత లాక్ డౌన్ – 4 కొనసాగుతుందని ప్రకటించారు. లాక్ డౌన్ ముగుస్తున్న మే 18 లోపు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ఫేస్ మాస్కులు కట్టుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ ను ప్రతి ఒక్కరూ తప్పకపాటంచాలని పిలుపునిచ్చారాయన.అయితే నాలుగో దశలో లాక్ డౌన్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు.
More News:
కరోనా టెస్టింగ్ కెపాసిటీ పెంపు: కోటి మందికి పరీక్షలు
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ
సంక్షోభాన్ని సంకల్పబలంతో ఎదుర్కొందాం..
కరోనా మహమ్మారి మానవ జాతి ఊహించని ఉపద్రవమని అన్నారు ప్రధాని మోడీ. యావత్ ప్రపంచం మొత్తంలో పరిస్థితులను చిన్నాభిన్నం చేసేసిందని, దీనిని సంకల్ప బలంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని, తమ వారిని కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తన సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. భారత్ లోనూ చాలా మంది ఈ వైరస్ వల్ల బాధితులుగా మారారని అన్నారు. ఈ వైరస్ దాడి చేసే సమయానికి మన దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యే పరిస్థితి లేదని, ఎన్-95 మాస్కులు కూడా అతి కొద్ది సంఖ్యలోనే తయారయ్యేవని చెప్పారాయన. వాటి కోసం తొలుత విదేశాలపైనే ఆధారపడిన మనం ఇప్పుడు దేశంలోనే రెండు లక్షలకు పైగా పీపీఈ కిట్లు, భారీగా మాస్కులు తయారు చేసుకుంటున్నామని చెప్పారు. సంక్షోభాలను ఆత్మ విశ్వాసం, నిర్భరతతో ఎదుర్కోవాలన్నదే మన భారత సంస్కృతి చెబుతోందని, ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధితో ధైర్యంగా ముందుకు సాగేందుకు సిద్ధం కావాలని సూచించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంటోందని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.