రికార్డు స్థాయిలో క‌రోనా టెస్టులు: ఒక్క రోజులో ల‌క్షపైగా ప‌రీక్ష‌లు

రికార్డు స్థాయిలో క‌రోనా టెస్టులు: ఒక్క రోజులో ల‌క్షపైగా ప‌రీక్ష‌లు

దేశంలో భారీగా క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సోమ‌వారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ల‌క్షా 8 వేల 233 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా టెస్టుల సంఖ్య 24,25,742కు చేరింద‌ని చెప్పింది. అందులో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,01,139 శాంపిల్స్ పాటిజివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. దేశంలో క్ర‌మంగా క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని, గ‌డిచిన 24 గంట‌ల్లో 2,350 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 39,174కు చేరిందని తెలిపింది. ప్ర‌స్తుతం క‌రోనా పేషెంట్ల రివ‌క‌రీ రేటు 38.73గా ఉంద‌ని, ఇది రోజు రోజుకూ మెరుగుప‌డుతోంద‌ని చెప్పింది.

యూకేలో ల‌క్ష మందికి 52 మ‌ర‌ణాలు.. భార‌త్ లో 0.2 డెత్స్

ఇక క‌రోనా పేషెంట్ల మ‌ర‌ణాల ప‌రంగా చూస్తే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,163 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంది. అయితే ప్ర‌పంచంలో మ‌ర‌ణాల రేటు భార‌త్ లో చాలా త‌క్కువ‌గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ల‌క్ష మంది జ‌నాభాకు భార‌త్ లో 0.2 మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు చెప్పింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 4.1గా ఉంద‌ని తెలిపింది. అయితే ఈ మ‌ర‌ణాల రేటు అభివృద్ధి చెందిన యూకే, అమెరికా వంటి దేశాల్లో చాలా ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పింది. అత్య‌ధికంగా బెల్జియంలో ల‌క్ష మంది జ‌నాభాకు 79.3 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా.. స్పెయిన్ లో 59.2, ఇట‌లీలో 52.8, యూకేలో 52.1, ఫ్రాన్స్ లో 41.9, స్వీడ‌న్ లో 36.1 నెథ‌ర్లాండ్స్ లో 33, అమెరికాలో 26.6 చొప్పున మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.