కరోనా పేషెంట్లను శ్మశానంలో పెట్టి.. అక్కడే ట్రీట్ మెంట్

కరోనా పేషెంట్లను శ్మశానంలో పెట్టి.. అక్కడే ట్రీట్ మెంట్

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సొంతూరులో ఘటన

సంగారెడ్డి , వెలుగు: కరోనా పేషెంట్లను సమాజం నుంచి వేలేసినట్టు శ్మశానవాటికలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంత గ్రామం ఖానాపూర్ తండాలో జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖానాపూర్ తండాలో ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చినట్టు బుధవారం డాక్టర్లు నిర్ధారించారు. కరోనా సోకిన ఇద్దరు పురుషులు, ఒక మహిళను హాస్పిటల్ కు పంపించకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు, డాక్టర్లు చెప్పారు.

ఊర్లో అందరి మధ్య ఉంచేందుకు పంచాయతీ పెద్దలు నిరాకరించారు. ఆ ముగ్గురిని ఎక్కడ ఉంచి ట్రీట్మెం ట్ ఇవ్వాలో అర్థం కాక వైద్య సిబ్బంది ఊరి శివారులో ఉన్న శ్మశానవాటికలో బస ఏర్పాటు చేసి ఉంచారు. ఆ ముగ్గురికి ట్యాబ్లె ట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కరోనా బాధితులను హాస్పిటల్ కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని స్థానికులు చెప్పినా ఎవరూ వినలేదు. బాధితులు కూడా ఎవరికి అడ్డు చెప్పకుండా శ్మశానానికి వచ్చే వారికోసం ఏర్పాటు చేసిన ఓపెన్ షెడ్డు లో ఇద్దరు పురుషులు, స్నానాల గదిలో మరో మహిళా పేషెంట్ రెండు రోజులుగా తలదాచుకుంటూ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.