చైనాలో కఠినంగా కరోనా ఆంక్షలు

చైనాలో కఠినంగా కరోనా ఆంక్షలు

ఫాక్స్​కాన్​ కంపెనీలో 20వేల మంది ఉద్యోగులకు వైరస్
అందరినీ లోపలే ఉంచేసిన యాజమాన్యం

హాంకాంగ్: ‘జీరో కోవిడ్’ స్ట్రాటజీ పేరుతో చైనా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు చాలా దారుణంగా ఉంటున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. హెనన్​ ప్రావిన్స్​ జెంగ్​ఝౌలోని ఐఫోన్​ తయారీ కంపెనీలో క్వారంటైన్​ నిబంధనలు తట్టుకోలేక ఉద్యోగులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నది. చైనాలోనే అతిపెద్ద కంపెనీ అయిన ఫాక్స్​కాన్​ జెంగ్​ఝౌలో ఉంది.

ఇక్కడ యాపిల్​ ఫోన్లు అసెంబుల్​ చేస్తుంటారు. ఐఫోన్​ 14  డివైజ్​ విడిభాగాలు కూడా ఉంటాయి. మొత్తం 3,50,000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారు. కాగా, 20వేల మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ గా తేలడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉద్యోగులు అందరినీ కంపెనీ లోపలే క్వారంటైన్​లో పెట్టింది. 

కాలినడకన వందల కిలో మీటర్లు

ఫ్యాక్టరీలో సరైన సౌలతులు, తినడానికి తిండి లేకపోవడంతో ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. వైరస్​ బారిన పడ్డవారికి, అనారోగ్యంపాలైన వారికి ఫ్యాక్టరీ తలుపులు మూసేసి ట్రీట్​మెంట్ చేస్తున్నారు. ఉద్యోగులు అందరినీ గదులకే పరిమితంచేస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు​ తమ సామాన్లు తీసుకొని ఫ్యాక్టరీ ఫెన్సింగ్​పై నుంచి దూకి, వందల కిలోమీటర్ల దూరం ఉన్న ఇండ్లకు కాలినడకన వెళ్లిపోతున్నారు. క్వారంటైన్​లోనే ఉన్న కరోనా బాధితులకు మాత్రం ఫ్యాక్టరీకి దగ్గర్లోని గ్రామ ప్రజలు ఆహారం, డ్రింక్స్​ ఇస్తున్నారు.