రాష్ట్రంలో సెకండ్​ వేవ్ ముగిసింది

రాష్ట్రంలో సెకండ్​ వేవ్ ముగిసింది
  • రాష్ట్రంలో మార్చి నుంచి మే ఫస్ట్‌‌ వీక్ వరకూ కరోనా ఉధృతి
  • మే రెండో వారం నుంచి తగ్గుముఖం
  • పీక్‌‌ స్టేజ్​లో 9.91% పాజిటివిటీ రేట్‌‌
  • ప్రస్తుతం 1.41 శాతానికి తగ్గుదల
  • 53 నుంచి 12.7 శాతానికి తగ్గిన బెడ్ ఆక్యుపెన్సీ
  • వంద రోజుల పాటు కొనసాగిన సెకండ్​ వేవ్​ ప్రభావం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్‌‌ వేవ్​ కథ ఒడిసింది. ఫస్ట్‌‌  వేవ్‌‌  8 నెలలు కొనసాగితే, సెకండ్ వేవ్‌‌  మూడు నెలల్లో ముగిసింది. గతేడాది మార్చిలో మొదలైన తొలి వేవ్‌‌ సెప్టెంబర్ వరకూ ఉధృతంగా కొనసాగింది. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. నవంబర్  నాటికి పూర్తిగా అదుపులోకి  వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకూ అడపాదడపా కేసులు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి చివరి వారంలో రోజూ 120 లోపే కేసులు నమోదవగా, మార్చి ఫస్ట్ వీక్ నుంచి కేసులు స్వల్పంగా పెరగడంతో సెకండ్​ వేవ్​ స్టార్టయింది. మార్చి ఫస్ట్ వీక్‌‌లో సగటున రోజూ 150  కేసులు వస్తే, సెకండ్​ వీక్‌‌లో 190, థర్డ్‌‌ వీక్‌‌లో 305 కేసులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య వేలల్లోకి వెళ్లింది. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో ఇన్‌‌ పేషెంట్ల సంఖ్య పెరగడం మొదలైంది.  అప్పటి నుంచి మే రెండో వారం వరకూ దవాఖాన్లన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. హాస్పిటళ్లలో బెడ్లు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్చి ఫస్ట్‌‌ వీక్‌‌లో బెడ్డు ఆక్యుపెన్సీ రేషియో 7 శాతం ఉండగా, మే సెకండ్ వీక్‌‌లో 53 శాతానికి చేరింది. దాదాపు రెండు వారాల పాటు పరిస్థితి అలాగే ఉండి, ఆ తర్వాత ఇన్‌‌పేషెంట్ల సంఖ్య తగ్గడం స్టార్ట్ అయింది. ప్రస్తుతం 12.7 శాతం బెడ్లలోనే పేషెంట్లు ఉండగా, 87.3 శాతం ఖాళీగా ఉన్నాయి.

చాలా వేగంగా వ్యాప్తి
ఫస్ట్‌‌ వేవ్‌‌ చాలా నెమ్మదిగా వేగం పెంచుకుంటే, సెకండ్ వేవ్ మాత్రం ఊహించనంత వేగంగా వ్యాపించింది. ఫస్ట్‌‌ వేవ్‌‌లో పీక్ నమోదవడానికి ఆరు నెలలు పడితే, సెకండ్‌‌ వేవ్‌‌ 70 రోజుల్లోనే పీక్‌‌కు వచ్చింది. మార్చి ఫస్ట్‌‌ రోజున 163 కేసులు నమోదవగా, ఏప్రిల్‌‌ 26న అత్యధికంగా 10,122 కేసులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సగటున రోజూ 16 వందల లోపలే కేసులు నమోదవుతున్నయి. పాజిటివిటీ రేటు కూడా మునుపటి స్థితికి వచ్చేసింది. సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు మన దగ్గర పాజిటివిటీ రేటు 0.41 శాతం మాత్రమే ఉంది. మార్చి ఫస్ట్ వీక్‌‌ నుంచి పెరగడం స్టార్ట్ అయింది. మే ఫస్ట్ వీక్ నాటికి 9.91 శాతానికి చేరింది. సెకండ్ వేవ్‌‌లో ఇదే హయ్యెస్ట్ పాజిటివిటీ రేటు కావడం గమనార్హం. ఆ తర్వాత వారం 8.27 శాతానికి తగ్గింది. ఈ వారంలో పాజిటివిటీ రేట్‌‌ 1.41 శాతానికి చేరుకుంది. ఇంకా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం 1,24,430 మందికి టెస్టు చేస్తే అందులో 1417(1.13 శాతం) మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.

తగ్గే  ముంగట లాక్‌‌డౌన్‌‌
కరోనా సెకండ్  వేవ్‌‌  వేగాన్ని, తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిలైంది. ఏప్రిల్‌‌లో చాలా మంది కరోనా మహమ్మారికి  బలయ్యారు. ఏప్రిల్​లోనే ఊర్లకు ఊర్లు సెల్ఫ్‌‌లాక్‌‌డౌన్‌‌లు ప్రకటించుకున్నా, దేశంలోని అన్ని రాష్ట్రాలూ లాక్‌‌డౌన్లు పెట్టినా మన దగ్గర మాత్రం ప్రభుత్వం స్పందించలేదు. హైకోర్టు కల్పించుకోవడంతో  ఏప్రిల్ 21 నుంచి నైట్ కర్ఫ్యూ పెట్టింది. కేవలం నైట్​ కర్ఫ్యూతో లాభం లేదని  ప్రజలు, ప్రతిపక్షాలు, డాక్టర్ల నుంచి  విమర్శలు వెల్లువెత్తడంతో  మే 12 నుంచి లాక్‌‌డౌన్​ను అమల్లోకి తెచ్చింది. కానీ, అప్పటికే కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది. ఏప్రిల్ 26న అత్యధికంగా 10,122 కేసులు నమోదైతే, లాక్‌‌డౌన్‌‌ పెట్టడానికి ఒక రోజు ముందు(మే 11) 4,801 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ.. ప్రభుత్వం మాత్రం లాక్‌‌డౌన్ స్ట్రిక్ట్‌‌గా అమలు చేయడం వల్లే కేసులు తగ్గాయని చెప్తోంది.

4 లక్షల నుంచి 62 వేలకు తగ్గిన కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కంట్రోల్​లోకి వస్తోంది. మే 5 నుంచి 8 వరకు వరుసగా 4 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవగా.. ఇప్పుడు 62 వేలకు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 7.98 లక్షల యాక్టివ్​ కేసులున్నాయని వెల్లడించింది. మే 10న కరోనా పీక్​ స్టేజ్​లో ఉన్నప్పుడు యాక్టివ్​ కేసులు 29.4 లక్షలుగా ఉండేవి. ప్రస్తుతం రికవరీ  రేట్ 96 శాతానికి చేరుకుంది. ఈ నెల 11 నుంచి 17 మధ్య 513 జిల్లాల్లో పాజిటివిటీ రేట్​ 5 శాతం కన్నా తక్కువగా నమోదైంది.  

కంప్లీట్‌‌ కంట్రోల్‌‌
ఫస్ట్ వేవ్‌‌ కంటే, సెకండ్ వేవ్‌‌ ర్యాపిడ్‌‌గా స్ప్రెడ్ అయింది. వ్యాధి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాస్పిటళ్లకు రావడంతో, బెడ్ల కేటాయింపులో కొంత ఇబ్బంది ఏర్పడింది. వైరస్ కంట్రోల్ చేయడంలో ఫీవర్ సర్వే, హాస్పిటల్స్‌‌ కోవిడ్ ఓపీ నిర్వహించడం.. సింప్టమ్స్ ఉన్న వెంటనే కిట్లు పంపిణీ చేయడం వంటి స్టెప్స్ చాలా ఉపయోగపడ్డయి. లాక్‌‌డౌన్‌‌తో పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చింది. మే సెకండ్ వీక్ నుంచి బెడ్‌‌ ఆక్యుపెన్సీ, పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పాజిటివిటీ రేట్‌‌ 1.4 శాతానికి వచ్చేసింది. సీఎం కేసీఆర్ సూచనలతో ఖమ్మం, నల్గొండలో కూడా రెండు వారాల్లోనే పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం. అన్‌‌లాక్‌‌ తర్వాత కూడా కేసులేమీ పెరగలేదు. కానీ, మాస్కులు, సోషల్ డిస్టన్స్ పాటించకపోతే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది.
- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌