- ఉద్యోగులకు కరోనా టెన్షన్
- తమకు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం
- ట్రైనింగ్‌కు చాలామంది దూరం.. లీవ్‌లో ఇంకొందరు
- సిబ్బందిలో ఇప్పటికే కొందరికి పాజిటివ్
- ఎంతమంది డ్యూటీకి వస్తారో తెలియని పరిస్థితి
- తమ వద్దకు ప్రచారానికే రావద్దంటున్న జనం..
- ఇక ఓటు వేసేందుకు వస్తారా అని అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల డ్యూటీకి వెళ్లేందుకు అధికారులు హడలిపోతున్నారు. రాష్ట్రాన్ని కరోనా చుట్టుముట్టడంతో ఈ టైంలో డ్యూటీలు చేయలేమని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే కొందరికి పాజిటివ్ రావడంతో.. తమకు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయపడిపోతున్నారు. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కరోనా హాట్స్పాట్లుగా మారిపోయాయని, మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాల కంటే డ్యూటీ ముఖ్యం కాదని అంటున్నారు. ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కరోనా టైమ్‌లో ఎన్నికలను ఆపాలని వివిధ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో తమ వద్దకు ప్రచారానికే రావద్దంటున్న జనం.. రేపు ఓటు వేసేందుకు మాత్రం వస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో 30న పోలింగ్ జరగనుంది. అయితే ఈ మినీ మున్సిపోల్స్ నోటిఫికేషన్ కంటే ముందే ఎస్ఈసీ ఆఫీస్‌లో ఎలక్షన్ కమిషనర్ తో పాటు సగం మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నియంత్రణ చర్యల్లో తలమునకలై పని చేస్తున్నరు. ఈటైమ్‌లో ఎన్నికలు పెట్టడంతో ప్రభుత్వ సిబ్బంది జంకుతున్నారు. నోటీసులు ఇస్తారనే భయంతో కొందరు విధుల్లో చేరేందుకు వస్తున్నా.. తీరా పోలింగ్ నాటికి డ్యూటీకి వచ్చే పరిస్థితి ఉందా అంటే ఆఫీసర్లకే నమ్మకం లేదు.
అంతా ఆగమాగం..
కరోనా కేసులతో రాష్ట్రం ఆగమాగం అవుతోంది. ప్రచారం సమయంలో లీడర్లు, కార్యకర్తలు కరోనా రూల్స్ పాటించడం లేదు. పోలింగ్ కేంద్రాల్లోనూ పెద్దగా సదుపాయాలు కల్పించడం లేదు. గతంలో సాధారణ సమయాల్లో నిర్వహించే ఎన్నికల మాదిరిగానే ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్, మాస్కులు ఏర్పాటు చేస్తామని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూస్తామని చెప్తున్నా.. పోలింగ్ కేంద్రం బయట అలాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు తక్కువ. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఓటర్లు గుమిగూడి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.
అన్నీ హాట్ స్పాట్లు..
ఎన్నికలు జరగనున్న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు ఉన్న జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం 329 కేసులు వచ్చాయి. సిద్దిపేటలో 268, ఖమ్మం జిల్లాలో 118 కేసులు, నాగర్ కర్నూల్లో122, మహబూబ్‌నగర్‌లో 226, నల్గొండలో 100 కేసులు వచ్చాయి. ఈ జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల దాకా ఉంది. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు తెలియడం లేదు. కొందరికి కొన్ని లక్షణాలు కనిపించినా.. కరోనా టెస్టు కోసం వెళ్తే వెంటనే పరీక్షించి, రిజల్ట్ చెప్పే పరిస్థితులు లేవు. మొత్తం 11.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తనకు కరోనా సోకిందని తెలియక ఒక్క పాజిటివ్ ఓటరు వచ్చినా.. చాలా మందికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లకూ వైరస్ సోకే అవకాశం ఉంది. సాగర్ బై ఎలక్షన్లోనూ ఇదే జరిగింది. అక్కడ క్యాంపెయిన్‌లో పాల్గొన్న లీడర్లతో పాటు కార్యకర్తలకు, పబ్లిక్కు వైరస్ సోకింది. దీంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
10% మందికి పాజిటివ్.. 30% మంది డ్యూటికీ నో
ఇప్పటికే ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైన అధికారుల్లో దాదాపు 10 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో తమకు కరోనా సోకుతుందేమోనని ఇతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రాణాల కంటే డ్యూటీ ముఖ్యం కాదంటూ ఎలక్షన్ ట్రైనింగ్‌కు కొందరు అధికారులు వెళ్లలేదు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 1,530 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్ సెంటర్‌కు ఐదుగురు చొప్పున ఎన్నికల అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో 20 శాతం సిబ్బందిని నియమించారు. ఇతర పనులకు కొంత సిబ్బంది అవసరం ఉంటుంది. ఇలా రాష్ట్రంలో 30న జరగనున్న మినీ మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 11 వేల మందిని ఎస్ఈసీ వాడుకుంటోంది. ఇందులో 30 శాతం మంది ట్రైనింగ్‌కు డుమ్మా కొట్టారు. దీంతో ఆఫీసర్లు డైలమాలో పడ్డారు. కరోనా టైమ్‌లో తమ కుటుంబాలకు ఇబ్బంది కలిగించి, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ డ్యూటీ చేయలేమని కొందరు సిబ్బంది లీవ్ పెట్టగా.. ఇంకొందరు తమ ఆరోగ్యం బాగా లేదని డ్యూటీకి రాలేమని చెబుతున్నారు. దీంతో మున్సిపోల్స్ నిర్వహణ ఆయా జిల్లాల కలెక్టర్లకు పెనుభారంగా మారింది.
ప్రచారానికి రావద్దంటూ బోర్డులు, ఫ్లెక్సీలు
ఎలక్షన్స్ అంటేనే ప్రచారం హోరాహోరీగా ఉంటుంది. కానీ కరోనా భయంతో తమ వద్దకు నాయకులు ప్రచారానికి రావొద్దంటూ ఓటర్లు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇళ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అపార్ట్మెంట్ల వాసులు, సోసైటీలుగా ఉన్న వారు.. కనీసం గేట్లోపలకు కూడా అనుమతించడం లేదు. ‘‘ఈ ఎన్నికలు పాడుగాను.. పాణం కంటే ఎక్కువనా? జర మంచిగయినంక పెట్టుకుంటే ఏమైతది’’ అంటూ నిలదీస్తున్నారు. క్యాంపెయిన్కే రావొద్దంటున్న వాళ్లు, ఓట్లు వేసేందుకు ఎంత మేరకు వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల క్యాండిడేట్లు కూడా వారి వెంట10 మంది కంటే ఎక్కువ మందిని ప్రచారానికి తీసుకెళ్లడంలేదు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు.
