కరోనా టెస్టింగ్ సెంటర్లు పెరిగినయ్..టెస్టులు తగ్గినయ్

కరోనా టెస్టింగ్ సెంటర్లు పెరిగినయ్..టెస్టులు తగ్గినయ్
  • యాంటీజెన్‌‌ సెంటర్లు 1,076కు పెంపు
  •  శనివారం 12,120 మందికే టెస్టులు హెల్త్ బులెటిన్‌‌లో వెల్లడి
  •  కంటెయిన్‌‌మెంట్ జోన్లపై అశ్రద్ద

 

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌‌ సెంటర్లు పెరుగుతున్నా టెస్టులు మాత్రం పెరగట్లేదు. శుక్రవారం వరకు 320 యాంటిజెన్ టెస్టింగ్ సెంటర్లుండగా శనివారానికి 1,076కు పెరిగినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ సెంటర్లు, ప్రైవేట్‌ ల్యాబుల్లో కలిపి శనివారం 12,120 మందికే టెస్టు చేశారు. ఇందులో 1,102 మందికి పాజిటివ్ వచ్చిందని, హైదరాబాద్‌‌లో 234 కేసులే నమోదయ్యాయని ఆదివారం బులెటిన్‌‌ విడుదల చేసింది.

జిల్లాల్లో 868 కేసులు నమోదయ్యాయని.. అత్య ధికంగా కరీంనగర్‌‌లో 101, రంగారెడ్డి(నాన్‌ జీహెచ్‌ఎంసీ)లో 81, వరంగల్ అర్బన్‌లో 70, సంగారెడ్డిలో 66, మేడ్చల్‌(నాన్‌ జీహెచ్‌ఎంసీ) లో 63 కేసులు నమోదయ్యాయని వెల్ల డించింది. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు వచ్చాయంది. వీటితో కలిపి రాష్ర్టంలో కరోనా కేసులు 91,361కి పెరిగాయి. ఇందులో 68,126 మంది కోలుకున్నారు. 22,542 మంది యాక్టివ్  పేషెంట్లున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ పేషెంట్లలో 15,502 మంది హోమ్‌, ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారంది. ప్రభుత్వ దవాఖాన్లలో 2,616 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని.. ఇందులో 1,211 మంది ఆక్సిజన్‌పై, 769 మంది వెంటి లేటర్‌‌పై ఉన్నారని చెప్పింది. వెంటిలేటర్‌‌పై ఉన్నవాళ్ల సంఖ్య శుక్రవారం వరకు  691 ఉండగా శనివారం 769కి పెరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 4,446 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వీళ్లలో 1,848  మంది ఆక్సిజన్‌పై, 835 మంది వెంటిలేటర్‌‌పై ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5,246 బెడ్లు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 3,577 బెడ్లు ఖాళీగా ఉన్నట్టు బులెటిన్‌లో ప్రకటించారు.

 ఏడొందలకు చేరువలో మరణాలు

ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా మృతుల సంఖ్య ఏడొందలకు చేరువైంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 9 మంది చనిపోయారని, మొత్తం మరణాలు 693కు పెరిగాయని బులెటిన్‌లో పేర్కొన్నా రు. కరోనా మృతుల్లో 46.13 శాతం మంది కేవలం కరోనాతోనే చనిపోయారని తెలిపారు. మిగతా 53.87 శాతం మంది ఇతర రోగాలతో బాధపడుతూ కరోనాతో చనిపోయారన్నారు. నెల రోజులుగా ఇదే లెక్కను బులెటిన్‌లో చూపిస్తున్నారు. వయసుల వారీగా పేషెంట్ల వివరాలనూ నెల రోజులుగా మార్చకుండా ప్రకటిస్తున్నారు. శనివారం నాటికి మొత్తం టెస్టులు 7,44,555కు చేరాయి. ఇందులో 1,046 మంది టెస్ట్ రిజల్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి.

పేరుకే కంటెయిన్ మెంట్లు

కంటెయిన్‌మెంట్ జోన్ల విషయంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తనకు నచ్చిన లెక్కలు ప్రకటిస్తున్నారు. జోన్ల ఏర్పాటుకు ప్రాతిపాదిక ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజూ వందకు పైగా కేసులు వస్తున్న మేడ్చల్‌, పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న కొత్తగూడెం, భూపాలపల్లి, వికారాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒక్క కంటెయిన్‌మెంట్ జోన్‌ కూడా లేదని రోజూ బులెటిన్‌లో ప్రకటిస్తు న్నారు. 70 వేలకుపైగా కేసులున్న గ్రేటర్ హైదరాబాద్‌లో 64 కంటెయిన్‌మెంట్‌ జోన్లే ఉన్నాయని చూపిస్తున్నారు. పదుల్లో కేసులు నమోదవుతున్న గద్వాల్ జిల్లాలో 157 జోన్లు ఉన్నట్టు చెబుతున్నారు. బులెటిన్‌లో జోన్లు ఉంటున్న ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండట్లేదు. బులెటిన్‌లో ఇవ్వాలని ఇస్తున్నారే తప్ప ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశం ఆరోగ్య శాఖ అధికారుల్లో కనిపించట్లేదని తెలుస్తోంది.