సూర్యపేటలో కరోనా టెస్టులు బంద్

సూర్యపేటలో కరోనా టెస్టులు బంద్

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు:  సూర్యాపేట జిల్లాలో  కరోనా పాజిటివ్​ కేసులు ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్​ తర్వాత రికార్డు స్థాయిలో జిల్లావ్యాప్తంగా 83 పాజిటివ్​ కేసులు వచ్చాయి. ఏప్రిల్12 వరకు జిల్లాలో ఒక్క పాజిటివ్​ కేసు మాత్రమే ఉంది. ఆ తర్వాత సంఖ్య ఉన్నట్టుండి పెరుగుతూ వచ్చింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 21న జిల్లాలో సీఎస్ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటించారు. అప్పటికి జిల్లాలో సెకండరీ కాంటాక్ట్స్ కింద191 శాంపిల్స్ పెండింగ్ లో ఉండగా, అదే రోజు మరో 85 శాంపిల్స్  సేకరించారు. మొత్తంగా 276 శాంపిళ్లకు సంబంధించిన రిపోర్ట్స్​ రావాల్సి ఉండగా, 35 శాంపిళ్ల​ రిపోర్టులు మాత్రమే రిలీజ్​చేశారు. 241 శాంపిళ్లను కేవలం సెకండరీ కాంటాక్ట్స్​అనే నెపంతో రిజెక్ట్ చేశారు.

23 నుంచి టెస్టులు లేవు..

ఏప్రిల్23 నుంచి అంటే గత12 రోజులుగా సూర్యాపేట జిల్లాలో ఒక్కరికీ  కరోనా టెస్టులు చేయలేదు. రాష్ట్రస్థాయిలో సెకండరీ కాంటాక్ట్స్ వ్యక్తులకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కానీ ఇక్కడి ఆఫీసర్లు ప్రారంభంలో మిగిలిన జిల్లాలకు భిన్నంగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​వ్యక్తులకు టెస్టులు చేశారు. అందువల్లే అత్యధికంగా 83 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో 32 పాజిటివ్​ కేసులు సెకండరీ కాంటాక్ట్స్​వే కావడం గమనార్హం. ఇలా కేసులను వెలికితీసినందుకు ఉన్నతాధికారులు అభినందించాల్సింది పోయి తమనే తప్పుపట్టారని  చెబుతున్నారు. 32 పాజిటివ్​ కేసులు సెకండ్​ కాంటాక్ట్స్ వారివే అయినందున 241 మందిలోనూ చాలా మందికి పాజిటివ్ ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ​

79 మందికి లక్షణాలు లేకున్నా పాజిటివ్..

సెకండరీ కాంటాక్ట్​ శాంపిల్స్​ను పక్కనపెట్టిన ఆఫీసర్లు లక్షణాలు ఉంటే తప్ప టెస్టులు చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఓ సంగతిని మరచిపోతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో  నమోదైన పాజిటివ్ కేసులను పరిశీలిస్తే 83 కేసుల్లో 79 మందికి అసలు లక్షణాలు లేవు. జ్వరంగాని, దగ్గు గాని లేవు.  పరీక్షలు చేసే దాకా వారికి కరోనా ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు సూర్యాపేట జిల్లాలో కరోనాను కంట్రోల్​చేశామని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెబుతున్న మాటలను ఎలా నమ్మేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సెకండరీ కాంటాక్ట్​ వ్యక్తుల నుంచి తీసుకున్న శాంపిల్స్​ను టెస్ట్ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.