
- కరోనా ట్రీట్మెంట్ పర్మిషన్.. 5 ఆస్పత్రులకు రద్దు
- ఉత్తర్వులు జారీ చేసిన డీహెచ్
- అధిక ఫీజుల ఫిర్యాదులపై చర్యలు
- విరించి హాస్పిటల్ కు రెండోసారి పర్మిషన్ క్యాన్సిల్
హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల దగ్గర అధిక చార్జీలు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చర్యలు తీసుకున్నారు. ఆయా ఆస్పత్రులకు కరోనా ట్రీట్మెంట్ పర్మిషన్ ను రద్దు చేశారు. బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ సరిగా ఇవ్వకపోవడంతో వంశీకృష్ణ అనే వ్యక్తి చనిపోయాడని అతని బంధువులు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ హాస్పిటల్‌కు డైరెక్టర్ గురువారం నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు హాస్పిటల్ స్పందించకపోవడంతో పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అలాగే బేగంపేట్‌లోని విన్ హాస్పిటల్, కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్, కూకట్‌పల్లిలోని మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్స్‌కు కూడా కరోనా ట్రీట్మెంట్ పర్మిషన్ ను రద్దు చేస్తూ డీహెచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా హాస్పిటళ్లకు ఇది వరకే నోటీసులు పంపించామని, సమాధానం ఇచ్చేందుకు 24 గంటల సమయం ఇచ్చామని తెలిపారు. హాస్పిటల్స్ నుంచి జవాబు రాకపోవడంతో పర్మిషన్ రద్దు చేశామని చెప్పారు. ఇప్పటికే ఆయా హాస్పిటళ్లలో ఉన్న పేషెంట్లకు ట్రీట్‌మెంట్ కొనసాగించాలని, కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని డీహెచ్ ఆదేశించారు. అధిక బిల్లులపై వాట్సాప్ (91541 70960) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సెకండ్ వేవ్‌లో కరోనా బిల్లుల దోపిడీపై 88 ఫిర్యాదులు మాత్రమే వచ్చినట్టు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. వాటన్నింటికీ గురువారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
మనీ రీఫండ్‌కు బాధితుల డిమాండ్..
విరించి హాస్పిటల్‌పై గతేడాది కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్పుడు కూడా ఆ హాస్పిటల్‌కు కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్‌ను రద్దు చేశారు. అయితే ఆ తర్వాత కూడా ఆ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ కొనసాగింది. కొన్నాళ్లకు ట్రీట్‌మెంట్ చేసుకోవడానికి మళ్లీ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ క్యాన్సిల్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవడమంటే.. కరోనా ట్రీట్మెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం, పునరుద్ధరించడమేనా? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ప్రశ్నించగా డబ్బులు రీఫండ్ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అధిక వసూళ్లకు పాల్పడినట్టు తేలిన హాస్పిటళ్ల నుంచి కంప్లయింట్లు చేసిన బాధితులకు మాత్రమే రీఫండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కాగా, పర్మిషన్ రద్దు అయిన ఐదు హాస్పిటళ్లపై 12 ఫిర్యాదులు నమోదవగా, వాటిలో 11 బిల్లుల దోపిడీపైన వచ్చిన ఫిర్యాదులే కావడం గమనార్హం.