యాంటీబాడీలకు దొరక్కుండా కరోనా​ ట్రిక్‌‌

యాంటీబాడీలకు దొరక్కుండా కరోనా​ ట్రిక్‌‌
  • విరుగుడు ఉందంటున్న సైంటిస్టులు

బర్మింగ్‌‌హామ్‌‌: మామూలుగా వైరస్‌‌లు మనుషుల శరీరంలోని కణాల్లోకి చేరి అక్కడ డూప్లికేట్లను ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత ఆ కణం పేలి అందులోంచి వైరస్‌‌లు బయటకు వచ్చి మరిన్ని కణాల్లోకి పోయి అక్కడ మళ్లీ అదే పని మొదలుపెడ్తాయి. ఇలా శరీరమంతా పాకి మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తాయి. ఇలాంటి టైమ్‌‌లోనే యాంటీబాడీలు అద్భుతంగా పనిచేస్తాయి. కణం నుంచి బయటకు వచ్చిన వైరస్‌‌లను అంటిపెట్టుకొని ఇంకో కణంలోకి పోకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సినేషన్‌‌ ద్వారా లేదా వైరస్‌‌ సోకడం ద్వారా మనుషుల శరీరంలో ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే ఇక్కడే కొందరికో ప్రశ్న వచ్చింది. కణం నుంచి బయటకు వచ్చిన వైరస్‌‌లను యాంటీబాడీలు ఆపగలవు కానీ మరి ఆ వైరస్‌‌లు అసలు బయటకు రాకుండా ఒక కణం నుంచి ఇంకో కణంలోకి పాకుతూ పోతే? తాజా స్టడీలో కరోనా వైరస్‌‌ కూడా ఇలా ఒక కణం నుంచి ఇంకో కణంలోకి పోతుందని వెల్లడైంది. మరి ఈ పరిస్థితుల్లో శరీరంలో యాంటీబాడీలున్నా ఉపయోగమేంటి? 

ట్రిక్స్‌‌ తెలుసుకుంటున్న వైరస్‌‌లు
వైరస్‌‌లు ఏండ్లుగా మనుషులు, జంతువులు, ఇతర జీవులతో కలిసి జీవిస్తున్నాయి. రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకోవాలో ట్రిక్స్‌‌ తెలుసుకున్నాయి. కొన్నిసార్లు వైరస్‌‌లు హోస్ట్‌‌ కణంలో నుంచి బయటకు రాకుండానే పక్క కణాన్ని దగ్గరకు తీసుకొని అందులోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరిగితే యాంటీబాడీలు ఎఫెక్టివ్‌‌గా పని చేయలేవు. ఇప్పటికే వైరస్‌‌ ఉన్న కణంలోకి వెళ్లి దాన్ని అడ్డుకోలేవు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌ కూడా మనుషుల శరీరంలోని కణాలను మార్చేయగలదని సైంటిస్టుల కొత్త రీసెర్చ్‌‌లో వెల్లడైంది. అలా మార్చి దగ్గర్లోని రెండు, మూడు కణాలను ఒక దగ్గరకు చేర్చి ఒకే కణంలా చేయగలదని తెలిసింది. ఇలా రూపొందిన కణాన్ని సుపర్‌‌ కణం అంటారని, ఇలాంటి సూపర్‌‌ కణాలు వైరస్‌‌లకు మంచి ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని సైంటిస్టులు చెప్పారు. వీటిల్లో ఒకటి కన్నా ఎక్కువ కేంద్రాలు, ద్రవం లాంటి సైటోప్లాసమ్‌‌ కూడా ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో కణాల బయట ఉన్న యాంటీబాడీలకు చిక్కకుండానే వైరస్‌‌ తన కాపీలను పెంచుకోగలదని, ఇంకో కణంలోకి పోగలదని వివరించారు.   

టీ సెల్స్‌‌ సక్కగ పని చేయకపోతే?
ఒక వేళ ఎవరి శరీరంలోనైనా టీ సెల్స్‌‌ సరిగా పనిచేయకపోతే వైరస్‌‌ శరీరంలో ఎక్కువకాలం ఉంటుంది. సెల్‌‌ నుంచి సెల్‌‌కు వ్యాప్తి జరుగుతుంది. ఈ సమయంలోనే వైరస్‌‌ మార్పులు చెందేందుకు అవకాశం ఉంటుంది. సెల్‌‌ నుంచి సెల్‌‌కు వైరస్‌‌ వ్యాపిస్తే వ్యాక్సిన్‌‌ వేసుకొని ఏంలాభం అనుకోవద్దని సైంటిస్టులు అంటున్నారు.

మరేం భయంలేదు..
వైరస్‌‌ ఇలా సెల్‌‌ నుంచి సెల్‌‌కు వ్యాప్తి చెందితే వ్యాక్సిన్లు పనిచేయవనే భయం అక్కర్లేదని సైంటిస్టులు చెబుతున్నారు. వైరస్‌‌లలాగే మన రోగ నిరోధక వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందు తూ వస్తోందంటున్నారు. మనుషులు టీకా వేసుకుంటే.. శరీరంలోని తెల్ల రక్తకణాలకు వైరస్​ను గుర్తించి నాశనం చేసేలా ట్రైనింగ్‌‌ ఇచ్చినట్టవుతుంది. కణాల బయట ఫ్రీగా తిరిగే వైరస్​లతో పాటు వైరస్‌‌ సోకిన కణాలనూ ఇవి నాశనం చేస్తాయి. టీకా వేసుకుంటే యాంటీబాడీలతో పాటు టీ సెల్స్‌‌ కూడా పెరుగుతాయి. శరీరంలోకి వైరస్‌‌ వెళ్లకుండా యాంటీబాడీలు అడ్డుకుంటే, వైరస్‌‌ను శరీరంలో నుంచి పూర్తిగా తొలగించే వరకు టీ సెల్స్‌‌ పనిచేస్తూనే ఉంటాయి.