జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ : AIIMS డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ : AIIMS డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

కరోనా లాక్‌డౌన్‌ తో తీవ్రంగా ఇబ్బందులు పడిన జనానికి ఢిల్లీ ఎయిమ్స్‌ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పంపిణీలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ‘ఇండియా టుడే హెల్త్‌గిరి అవార్డ్స్‌ 2020 సందర్భంగా ఇవాళ(శుక్రవారం) ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, వ్యాక్సిన్‌ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం వరకు వ్యాక్సిన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ప్రారంభంలోనే దేశ జనాభా మొత్తానికి సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాదన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి ముందుగా ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేసేవారిని, కరోనా వారియర్స్‌ను ఒక వర్గంగానూ… కరోనాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని మరొక వర్గంగానూ విభజించి వీరికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై ఆలోచనలు జరుగుతున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ ఇవ్వడంతో ప్రాధాన్యతా క్రమాన్ని కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు రణదీప్‌ గులేరియా.