వచ్చే జూన్‌‌‌‌కు కరోనా వ్యాక్సిన్‌‌‌‌ రెడీ

వచ్చే జూన్‌‌‌‌కు కరోనా వ్యాక్సిన్‌‌‌‌ రెడీ

ప్రభుత్వం అనుమతిస్తే ఎమర్జెన్సీ వాడకానికి వెంటనే వ్యాక్సిన్: భారత్ బయోటెక్

ధర గురించి తరువాత చెబుతాం

డిసెంబరు నుంచి కొత్త ప్లాంటు 

హైదరాబాద్​, వెలుగు: కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం డెవెలప్ చేస్తున్న కోవాక్సిన్‌‌‌‌ను వచ్చే ఏడాది జూన్‌‌‌‌లో వ్యాక్సిన్‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేస్తామంటూ భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ కీలక ప్రకటన చేసింది. అత్యవసర వాడకం కోసం ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే వెంటనే వ్యాక్సిన్‌‌‌‌ను అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. వచ్చే నెల నిర్వహించే ఫేజ్‌‌‌‌–3 ట్రయల్స్‌‌‌‌ సందర్భంగా 26 వేల మందిపై వ్యాక్సిన్‌‌‌‌ను ప్రయోగిస్తామని తెలియజేసింది. దేశవ్యాప్తంగా 30 చోట్ల ప్రయోగాలు చేయడానికి కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ప్రయోగాలు చేసే సైట్లలో అనుమతుల కోసం ఎథిక్స్ కమిటీకి దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ సాయి ప్రసాద్ వెలుగుతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం కావాలనుకుంటే ఎమర్జెన్సీ యూజ్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ ఇవ్వొచ్చు. ఇందుకోసం ఫేజ్‌‌‌‌–2 ట్రయల్స్‌‌‌‌ ఫలితాలను పరిశీలించవచ్చు. ఇది వరకు జంతువులపై చేసిన ప్రయోగాల ద్వారా ఆశించిన ఫలితాలు వచ్చాయి. చైనా, రష్యాలో వ్యాక్సిన్లను అత్యవసర సమయాల్లో వాడటానికి అక్కడి గవర్నమెంట్లు అనుమతులు ఇచ్చాయి’’ అని ఆయన వివరించారు.

అనుమతులు వచ్చాయ్‌‌‌‌..

కోవాక్సిన్‌‌‌‌ మూడోదశ ట్రయల్స్‌‌‌‌ కోసం భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌కు సెంట్రల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌కు చెందిన సబ్జెక్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీ (ఎస్‌‌‌‌ఈసీ) గత వారమే పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. ఫేజ్‌‌‌‌–1, ఫేజ్‌‌‌‌–2 ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ట్రయల్స్‌‌‌‌ డేటాను కంపెనీ బహిర్గతం చేయలేదు. అయితే, కోవాక్సిన్‌‌‌‌ ధర వివరాలను వెల్లడించడానికి ప్రసాద్‌‌‌‌ ఇష్టపడలేదు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రొడక్షన్‌‌‌‌ ఖర్చు, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు, ఎన్ని డోసులు అవసరమవుతాయి అనేవి లెక్కలోకి తీసుకొని ధర నిర్ణయిస్తామని అన్నారు. ‘‘కరోనా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ వంటి కంపెనీలకు గేట్స్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌, కోవాక్స్‌‌‌‌ నుంచి సాయం అందింది. మాకు అటువంటి ఫండింగ్‌‌‌‌ ఎవరూ ఇవ్వలేదు. మూడోదశ ట్రయల్స్‌‌‌‌ కోసం మా కంపెనీ రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది కాకుండా కోవాక్సిన్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌లోనే పెడుతున్న  కొత్త ప్లాంటుకు మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. కొత్త ప్లాంట్‌‌‌‌ డిసెంబరు నుంచి పనిచేస్తుంది’’ అని సాయిప్రసాద్‌‌‌‌ వివరించారు. భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ ఒక ప్లాంటును ఇప్పటికే రెడీ చేసింది. ఈ ప్లాంటుకు ఏటా 15 కోట్ల డోసులను తయారు చేసే కెపాసిటీ ఉంది. కొత్త ప్లాంటులో వ్యాక్సిన్‌‌‌‌ను తయారు చేయడమేగాక, థర్డ్‌‌‌‌పార్టీకి చెందిన మరో వ్యాక్సిన్‌‌‌‌ ప్లాంటును కూడా ఉపయోగించుకోవాలని కంపెనీ కోరుకుంటోంది.  కొత్త ప్లాంటు వస్తే ఏటా 100 కోట్ల డోసులను తయారు చేయవచ్చు అని ఆయన వెల్లడించారు.

విదేశాలూ అడుగుతున్నాయ్‌‌‌‌…

కోవాక్సిన్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ చేయమని ఇతర దేశాలూ అడుగుతున్నాయని సాయిప్రసాద్‌‌‌‌  చెప్పారు. ప్రొడక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ఖరారయ్యాక అంతర్జాతీయ మార్కెటింగ్‌‌‌‌ గురించి ఆలోచిస్తామని  తెలిపారు. గతంలో డెవలప్‌‌‌‌ చేసిన తమ వ్యాక్సిన్స్‌‌‌‌ను చాలా దేశాలకు ఎగుమతులు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరో రెండు వ్యాక్సిన్లు కూడా…

ఇండియాలో ప్రస్తుతం మూడు రకాల కరోనా వ్యాక్సిన్లపై ట్రయల్స్‌‌‌‌ జరుగుతున్నాయి. వీటిలో కోవాక్సిన్‌‌‌‌ ఒకటి. కోవిషీల్డ్‌‌‌‌ పేరుతో సీరమ్‌‌‌‌, జోకోవి-డ్‌‌‌‌ పేరుతో జైడస్‌‌‌‌ క్యాడిలా వ్యాక్సిన్‌‌‌‌ తయారు చేస్తోంది. ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా డెవలప్‌‌‌‌ చేసిన వ్యాక్సిన్‌‌‌‌ను సీరమ్‌‌‌‌ ఇండియాలో తయారు చేస్తోంది. అంతేగాక, కోవిషీల్డ్‌‌‌‌పై మూడోదశ ట్రయల్స్‌‌‌‌ మొదలయ్యాయి. భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌, జైడస్‌‌‌‌ వ్యాక్సిన్లపై త్వరలో మూడోదశ ట్రయల్స్‌‌‌‌ ఆరంభమవుతాయి. ఈ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌‌‌‌ ఇటీవల మాట్లాడుతూ వచ్చే ఏడాది జూలై నాటికి 25 కోట్ల మందికి 50 కోట్ల వ్యాక్సిన్‌‌‌‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.