పిల్లలు, యూత్ కు వ్యాక్సిన్ అక్కర్లేదట!

పిల్లలు, యూత్ కు వ్యాక్సిన్ అక్కర్లేదట!

కరోనా వచ్చిపోయినోళ్లు కూడా వేసుకోవచ్చు

మన జనాభాలో 60 శాతం మందికి టీకా ఇస్తే సరిపోతది

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ నుంచి పిల్లలకు, యువకులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం తమకు ఉన్న సమాచారం ప్రకారం 16 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు, కోమార్బిడిటీస్ లేని యువతకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మన జనాభాలో 60 శాతం మందికి వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. దీంతో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి వ్యాక్సిన్ తీసుకోని పిల్లలకు, యువతకు కూడా వైరస్ సోకే ముప్పు తగ్గుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్‌‌కు సంబంధించిన పలు అంశాలను ఆయన గురువారం మీడియాకు వివరించారు. ఇప్పటికే కరోనా వచ్చిన వాళ్లు వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయనడంలో ఎలాంటి శాస్ర్తీయత లేదన్నారు. వైరస్ వచ్చిపోయిన వాళ్లు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని, ఇబ్బందేమీ ఉండదన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందు కరోనా టెస్ట్‌‌, యాంటిబాడీస్ టెస్ట్‌‌ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

రోగాలు ఉంటే డాక్టర్లదే నిర్ణయం

లంగ్స్‌‌, కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడుతున్న వారి విషయంలో, వారి కండీషన్‌‌ను బట్టి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌లో ఉండే డాక్టర్లు, ప్రతి ఒక్కరి నుంచి వారికి ఉన్న జబ్బుల వివరాలను సేకరిస్తారని చెప్పారు. రోగులు ఇచ్చే సమాచారం, వారు వినియోగిస్తున్న మెడిసిన్ తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే వారికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చో లేదో నిర్ణయిస్తారని చెప్పారు. ప్రెగ్నెంట్లు, బాలింతల విషయంలోనూ ఇదే పద్ధతిని
పాటిస్తామన్నారు.

దద్దుర్లు సహజమే

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంజక్షన్ వేసిన చోట చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం వంటివి సహజమేనని శ్రీనివాసరావు వివరించారు. ఎలాంటి రియాక్షన్ వచ్చినా వెంటనే అవసరమైన వైద్యం అందించేందుకు తమ డాక్టర్లు సిద్ధంగా ఉంటారని, వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్నవారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ అవసరం ఎక్కువగా ఉందని, వీళ్లందరికీ టీకా వేస్తామన్నారు. వ్యాక్సిన్ విషయంలో సెంట్రల్‌‌ హెల్త్ మినిస్ర్టీ ఇచ్చే గైడ్‌‌లైన్స్ ప్రకారమే ముందుకెళ్లామని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి కేవలం 4 రోజుల ముందు పూర్తి గైడ్‌‌లైన్స్‌‌ వస్తాయని వెల్లడించారు.

మరో 509 మందికి కరోనా

మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 48,652 మందికి టెస్టు చేస్తే.. 509 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వెల్లడించింది. గ్రేటర్‌‌‌‌ పరిధిలో 104, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి (నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ)లో 45, రంగారెడ్డి (నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ)లో 42  కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఇప్పటివరకు 2,70,967 మంది కోలుకోగా.. 7,172 మంది యాక్టివ్‌‌ పేషెంట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వైరస్‌‌తో మరో ముగ్గురు చనిపోయారని, మృతుల సంఖ్య 1,505కు చేరిందన్నారు. ఇప్పటివరకు 63,06,397 టెస్టులు చేశామని, కేసుల సంఖ్య 2,79,644కి పెరిగిందని గురువారం రిలీజ్‌‌ చేసిన హెల్త్‌‌ బులెటిన్‌‌లో పేర్కొన్నారు.