నీటిలోనూ కరోనా వైరస్

నీటిలోనూ కరోనా వైరస్

పారిస్ : కరోనా వైరస్ జాడలు నీటిలోనూ ఉన్నాయని తేలింది. ఇప్పటికే ప్రపంచమంతా వణికిపోతుంటే తాజాగా నీళ్లలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడటం కలకలం రేపుతోంది. ఫ్రాన్స్ లోని పారిస్ లో రోడ్లను శుభ్రం చేసేందుకు మొక్కల కోసం వాడే నీటిలో కరోనా ఉందని గుర్తించారు. తాగే నీటిలో మాత్రం కరోనా లక్షణాలు లేవని పారిస్ వాటర్ అథారిటీ అధికారులు తెలిపారు. నగరంలోని 27 చోట్ల నీటి నమునాలు సేకరించగా వాటిలో నాలుగింటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు స్వల్పంగా ఉన్నట్లు తేల్చారు. దీంతో వెంటనే ఆ నీటిని వాడటం ఆపేశామని నగర అధికారి సిలియా బ్లాయూల్ చెప్పారు. పారిస్ లో పార్కులు, రోడ్లు శుభ్రం చేసేందుకు వాడే నీరు వేరు, తాగేందుకు వాడే నీరు వేరుగా ఉంటుంది. తాగే నీళ్లలో మాత్రం కరోనా లేదని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. పారిస్ లోని సీని రివర్, ఆర్క్యూ కెనాళ్ల నుంచి నీటి పార్క్ లు, రోడ్లు క్లీన్ చేసేందుకు వాడుతున్నారు. ఈ నీటిలోని కరోనా ఎలా వచ్చిందన్నది అర్థం కావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సరఫరా చేసిన నీటి ద్వారా ఏదైనా ప్రమాదం ఉందా అన్నది తెలుసుకునే పనిలో ఉన్నామని అధికారులు చెప్పారు.