నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కర్ణాటకలోకి ఎంట్రీ

నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కర్ణాటకలోకి ఎంట్రీ

బెంగళూరు: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. అక్కడి నుంచి వచ్చే వారిపై కర్ణాటక రాష్ట్రం ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక వచ్చే వాళ్లు కరోనా నెగెటివ్ రిపోర్ట్ లేదా కనీసం ఒక్క డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని కర్ణాటక చీఫ్ సెక్రటరీ పి. రవి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బస్సు, ట్రైన్, ఫ్లైట్.. ఏ మార్గంలో వచ్చినా ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ 72 గంటల లోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ మాత్రమే అయ్యి ఉండాలని కండిషన్ పెట్టారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో డెల్టా ప్లస్ కేసులు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన కలబుర్గి, బెలగావి, విజయపుర, బీదర్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో సీఎస్ రవి కుమార్ ఆదేశించారు.  అయితే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు, హెల్త్ వర్కర్స్, రెండేండ్ల లోపు వయసున్న పిల్లలకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని చెప్పారు. అలాగే కుటుంబసభ్యుల అంత్యక్రియలకు వెళ్లే సామాన్యులకు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లను చెక్ పోస్టుల్లో అపొద్దని, కరోనా నెగెటివ్ రిపోర్ట్ కానీ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ లేకపోయినా అనుమతించాలని సూచించారు. అయితే వారి దగ్గర నుంచి స్వాబ్ శాంపిల్ తీసుకుని రాష్ట్రంలోకి పంపాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.