గద్వాలలో కరోనా కలకలం : రంగంలోకి దిగిన ఆఫీసర్లు

గద్వాలలో కరోనా కలకలం : రంగంలోకి దిగిన ఆఫీసర్లు

ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడం..ఇందులో శాంతి నగర్ కు చెందిన వృద్ధుడు మృతి చెందడంతో గద్వాల ఉలిక్కి పడింది. అలర్ట్ అయిన అధికారులు ఢిల్లీకి ఎంత మంది వెళ్లారు..? చనిపోయిన వృద్ధుడు ఎంతమందిని కలిశాడు..? అంత్యక్రియల్లో  ఎవరెవరు పాల్గొన్నారు..? అనే అంశాలపై ఆరాతీస్తున్నారు. మంగళవారం ఇంటింటి సర్వే చేపట్టిన వైద్యాధికారులు అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి గద్వాల ఆస్పత్రిలో ఐసోలేట్ లక్షణాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్ లో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

నిర్లక్ష్యమే కొంపముంచుంది..!

ఢిల్లీని నిజాముద్ధీన్ ప్రాంతంలోని మర్కజ్ లో మార్చి 13నుంచి 15వరకు నిర్వహించిన మత ప్రచార సభకు ఉమ్మడి జిల్లా నుంచి 70మందికి పైగా హాజరయ్యారు. వీరంతా తిరిగి 17న స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇందులో గద్వాల జిల్లా శాంతినగర్ కు చెందిన ఓ వృద్ధుడు 19న అనారోగ్యానికి గురికాగా..స్థానిక ఆర్ ఎంపీ డాక్టర్ కు చూపించారు. నయం కాకపోవడంతో 27న కర్నూల్ కు తీసుకెళ్లారు. కరోనా లక్షణాలకు కనిపించకపోవడంతో అక్కడ పట్టించుకోలేదు. దీంతో అదేరోజు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..అప్పటికే మృతి చెందారు.

అలర్ట్ అయిన అధికారులు

వృద్ధుడి మృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. గద్వాల నుంచి 28, మహబూబ్ నగర్ నుంచి 26మంది, నాగర్ కర్నూల్ నుంచి 11మంది, నారాయ పేట నుంచి ఇద్దరు, వనపర్తి నుంచి ముగ్గురు మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు గుర్తించి క్వారంటైన్ చేశారు. అలాగే వృద్ధుడి అంత్యక్రియలకు వెళ్లిన 29మందిని గుర్తించి అబ్జర్వేషన్ లో పెట్టారు. ఇందులో మానవపాడుకు ఇద్దరు బంధువులను ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు. అలాగే చనిపోక ముందు కలిసిన మరో ఇద్దరితోపాటు ఓ ఆర్ఎంపీ కూడా డాక్టర్ ను కూడా క్వారంటైన్ చేశారు. అదనపు కలెక్టకర్ శ్రీనివాస రెడ్డి, కమిషనర్ పార్ధసారథి, డీఎం అండ్ హెచ్ వో శశికళ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కల్వకుర్తిలో కలకలం

ఢిల్లీ మత ప్రార్ధనల్లో పాల్గొన్న కల్వకుర్తికి చెందిన వ్యక్తికి పాజిటివ్ లక్షణాలున్నాయనే అనుమానంతో కలకలం రేగింది. అధికారులు వెంటనే అతనినని ఫీవర్ ఆస్పత్రికి, 16మంది కుటుంబ సభ్యులను కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో రాజేష్ కుమార్, డీఎస్పీ గిరిబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. మను చౌదరి మాట్లాడుతూ అతను అతనిని ఎవరెవరు కలిశారో గుర్తించాలని ఆదేశించారు. బుధవారం కల్వకుర్తి బంద్ పాటిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ప్రకటించారు.

సమాచారం ఇవ్వండి

ఢిల్లీలో మతపరమైన ప్రార్ధనలో పాల్గొని జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ రెమో రాజేశ్వరితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో 15మంది వెళ్లి వచ్చినట్లు తమవద్ద సమాచారం ఉందని తెలిపారు. ఎవరైనా ఉంటే ట్రోల్ ఫ్రీ నెంబర్ – 08542241165కు చేయాలని కోరారు.