దేశంలో కరోనా కంట్రోల్​ కావట్లే

దేశంలో కరోనా కంట్రోల్​ కావట్లే
  • ఒక్కరోజే 81 వేల మందికి పాజిటివ్‌
  • వైరస్​ కారణంగా 469 మంది మృతి
  • 23 రోజులుగా భారీగా పెరుగుతున్న కేసులు
  • గత 24 గంటల్లో 36.7 లక్షల మందికి టీకా
  • మహారాష్ట్రలోని పుణెలో వారం నైట్‌ కర్ఫ్యూ
  • మధ్యప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గట్లేదు. 23 రోజులుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 81,466 మంది వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడ్డారు. 6 నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.23 కోట్ల కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6.14 లక్షల యాక్టివ్‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇది 5 శాతమంది. రికవరీ రేటు తగ్గుతూ వస్తోందని, ప్రస్తుతం 93.67 శాతం ఉందని వివరించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 469 మంది మరణించారని.. ఇందులో మహారాష్ట్రలో 249 మంది, పంజాబ్‌‌‌‌‌‌‌‌లో 58, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో 34, తమిళనాడులో 19, కర్నాటకలో 18, కేరళలో 11, ఢిల్లీలో 9, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 9 మంది చనిపోయారని తెలిపింది. ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 24.59 కోట్లు శాంపుల్స్‌‌‌‌‌‌‌‌ను టెస్టు చేశారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1న 11.13 లక్షల శాంపుల్స్‌‌‌‌‌‌‌‌ పరీక్షించారు. గత 24 గంటల్లో దేశంలో 36.7 లక్షల మందికి టీకా డోసులను పంపిణీ చేశారు. ఒక్కరోజులో ఇంత మందికి టీకా వేయడం ఇదే హయ్యెస్టయని హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ చెప్పింది. మొత్తంగా 6.87 కోట్ల మందికి టీకాలు వేశారని తెలిపింది. 

మహారాష్ట్రలో ఒక్కరోజే 43 వేల కేసులు
మహారాష్ట్రలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అక్కడ 43,183 మందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలింది. ఒక్కరోజే 249 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 28 లక్షల మంది వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడగా 24 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.67 లక్షల యాక్టివ్‌‌‌‌‌‌‌‌ కేసులున్నాయి. ముంబైలో ఒక్కరోజే 8,600 కేసులు నమోదయ్యాయి. 18 మంది మరణించారు.


పుణెలో నేటి నుంచి నైట్‌‌‌‌‌‌‌‌ కర్ఫ్యూ
కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పుణెలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 3 నుంచి వారం రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. 

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని దుర్గ్‌‌‌‌‌‌‌‌లో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌
చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని దుర్గ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 6 నుంచి 14 వరకు లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ పెడుతున్నట్టు ఆ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.  మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని చింద్వారా, రట్లామ్‌‌‌‌‌‌‌‌, ఖర్గావ్‌‌‌‌‌‌‌‌ జిల్లాల పట్టణ ప్రాంతాల్లో కూడా అక్కడి సర్కారు లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.

భర్తకు పాజిటివ్‌‌‌‌‌‌‌‌.. ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రియాంక
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఐసొలేషన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘టెస్టులో నాకు నెగెటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.. సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నా’ అని వీడియో మెసేజ్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు.

మాస్క్ లేనందుకు బస్సు నుంచి దింపేసిన్రు
‘‘మాస్క్ ఏడుందంటే.. షర్టు అడ్డం పెట్టుకుంటున్నవేందీ..?” అని ఓ ప్యాసింజర్ ను పోలీసు అడుగుతున్న ఈ సీన్ శుక్రవారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో కనిపించింది. మాస్క్ పెట్టుకోకుండా సిటీ బస్సులో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కనిపించడంతో పోలీసులు బస్సును ఆపి, ఆ వ్యక్తిని ఇలా కిందకు దింపేశారు.

లాక్ డౌన్ తప్పదు: ఉద్ధవ్
పరిస్థితి ఇలాగే కొనసాగితే..  లాక్ డౌన్ తప్పదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ అన్నారు. ఫస్ట్ వేవ్ కన్నా.. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. కేసులు పెరుగుతూనే ఉంటే.. డాక్టర్లు, నర్సుల కొరత ఏర్పడవచ్చన్నారు. జనవరిలో రోజుకు 350 మంది పేషెంట్లు ఉంటే.. ఇప్పుడు రోజుకు 8,500 మంది వస్తున్నారని చెప్పారు. త్వరలోనే ప్రతి రోజు రెండున్నర లక్షల టెస్టులు చేస్తామని, ఇందులో 70 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులే ఉంటాయన్నారు.

లాక్‌‌డౌన్‌‌ ఆలోచన లేదు: కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌
ఢిల్లీలో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ పెట్టే ఆలోచన లేదని సీఎం అరవింద్‌‌‌‌‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కరోనా కేసుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ లాంటి పరిస్థితి వస్తే అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఢిల్లీలో కేసులు పెరగడం కాస్త ఆందోళక కలిగిస్తోందని, అయితే ప్రస్తుతానికి పరిస్థితి చేయి దాటి పోలేదని చెప్పారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 2,790 కేసులు నమోదయ్యాయి.