
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు కరోనా వ్యాక్సిన్‌లు ఎమర్జెన్సీగా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కరోనా మేనేజ్‌మెంట్ నేషనల్ టాస్క్ ఫోర్స్‌లో సభ్యుడైన గులేరియా వ్యాక్సిన్ అందుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి నాటికి వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసరంగా వ్యాక్సిన్‌ను ఉపయోగించాలనుకుంటే జనవరిలో ఈ రెండు టీకాలు రెడీగా ఉంటాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెడితే తొలుత వైరస్‌తో బాధపడుతున్న వారికి అనంతరం ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అందిస్తామని పేర్కొన్నారు. ఇంతకుముందు ఓసారి వ్యాక్సిన్ గురించి గులేరియా మాట్లాడుతూ.. 2022 వరకు సామాన్యులకు టీకా అందుబాటులోకి రాదని చెప్పడం గమనార్హం. కాగా, మరికొన్ని వారాల్లో దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోడీ శుక్రవారం పేర్కొన్న సంగతి తెలిసిందే.