V6 News

చైనాను దాటిన ఇండియా.. కరోనా కేసుల్లో 11వ స్థానానికి

చైనాను దాటిన ఇండియా.. కరోనా కేసుల్లో 11వ స్థానానికి
  • దేశంలో 83,085 మంది.. చైనాలో 82,933 మందికి వైరస్​
  • మరణాల విషయంలో మనమే బెటర్​
  • మన దగ్గర మరణాల రేటు 3 శాతం.. చైనాలో 5.5 శాతం
  • మనకు ఎపిసెంటర్​ ముంబై.. కేసుల్లో ఆ సిటీ వాటానే 20%
  • మెయిన్​ సిటీల్లోనే ఎక్కువ.. 61% కేసులు అక్కడే
  • ప్రపంచవ్యాప్తంగా 45.7 లక్షల కేసులు
  • 3.04 లక్షల మంది బలి.. 17.24 లక్షల మంది రికవర్​
  • కేసుల్లో 2 లక్షల మార్కును దాటిన బ్రెజిల్​

న్యూఢిల్లీ: కరోనాకు మూల కారణమైన చైనాను ఇండియా దాటింది. చైనాలో నమోదైన కేసుల కన్నా ఎక్కువ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇప్పటిదాకా చైనాలో 82,933 కేసులు నమోదైతే, మన దగ్గర 83,085 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో నిన్నటిదాకా 12వ ప్లేస్​లో ఉన్న ఇండియా, ఇప్పుడు 11వ ప్లేస్​కు వచ్చింది. అయితే, మరణాల విషయంలో మాత్రం ఆ దేశంతో పోలిస్తే మనమే మెరుగ్గా ఉన్నాం. దేశంలో 2,662 మంది చనిపోతే చైనాలో4,633 మంది బలయ్యారు. అంటే చైనాలో మరణాల రేటు 5.5 శాతం కాగా, ఇండియాలో మరణాల రేటు కేవలం 3.2 శాతమే. ప్రస్తుతం చైనాలో 78,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 91 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. అయితే, చైనాలో కరోనాకు ఎపిసెంటర్​ అయిన వుహాన్​లో కొద్ది రోజుల క్రితం జీరో కేసులున్నాయి. అయితే, మళ్లీ అక్కడ కొత్త కేసులు పుట్టుకొస్తుండడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. అందుకే అక్కడి ప్రజలందరికీ టెస్టులు చేయించాలని ఆ దేశ సర్కార్​ నిర్ణయించింది. కేవలం పది రోజుల్లో కోటి పది లక్షల మందికి కరోనా టెస్టులు చేయనుంది. అయితే, అది సాధ్యమయ్యేపనేనా అన్నది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్నగా మిగిలింది. వుహాన్​ను పక్కనపెడితే షూలన్​, జిలిన్​ వంటి సిటీల్లోనో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రెండు సిటీల్లో చైనా లాక్​డౌన్​ ప్రకటించింది.

మనకు ఎపిసెంటర్​ ముంబై

మన దేశానికి కరోనా ఎపిసెంటర్​ మహారాష్ట్ర రాజధాని ముంబై. దేశంలో 83 వేల కేసులుంటే 28 వేల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అంటే, 33.7 శాతం కేసుల వాటా ఆ రాష్ట్రానిదే. అదే ముంబై వాటా 20.5 శాతం. సిటీలో ప్రస్తుతం 17 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పుకునే ధారావిలో పరిస్థితి సీరియస్​గానే ఉంది. రాష్ట్రంలో 1,019 మంది చనిపోతే, ముంబైలో 621 మంది కన్నుమూశారు. దేశవ్యాప్తంగా 28,874 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 35%. 51,544 మంది ఇంకా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. తమిళనాడులోనూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్​గా చెప్పుకునే కోయంబేడు మార్కెట్​ నుంచి కేసులు భారీగా నమోదయ్యాయి. దేశంలో మర్కజ్​ సమావేశాలతో ఒక్కసారిగా కేసులు పెరిగినట్టు, ఇప్పుడు తమిళనాడులో కేసులు పెరగడానికీ ఆ మార్కెటే కారణం.

మెయిన్​ సిటీల్లోనే ఎక్కువ కేసులు

దేశంలో ప్రధాన సిటీలు అని చెప్పుకునే వాటిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్​, చెన్నై, పుణే, ఠాణే, ఇండోర్​, కోల్​కతా, హైదరాబాద్​, భోపాల్​, జైపూర్​ వంటి సిటీల్లోనే ఎక్కువ మొత్తంలో కేసులు రికార్డవుతున్నాయి. ఈ సిటీల్లోనే 61 శాతం కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 50,477 కేసులు ఈ సిటీల నుంచే ఉన్నాయి.

ప్రపంచంలో 45.7 లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 45,69,064 మంది కరోనా బారిన పడ్డారు. 3,04,794 మంది చనిపోగా, 17,24,907 మంది కోలుకున్నారు. 25,39,363 మంది ఇంకా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. అందులో 45,361 మంది పరిస్థితి సీరియస్​గా ఉంది. అమెరికాలో కేసులు 15 లక్షలకు దగ్గరవుతున్నాయి. మొత్తంగా అక్కడ 14,60,988 మంది కరోనా బారిన పడగా, 87,025 మంది చనిపోయారు. బ్రెజిల్​ కూడా కేసుల్లో 2 లక్షల మార్కును దాటింది. అక్కడ 2,06,507 మంది కరోనా బాధితులున్నారు. 14,131 మంది చనిపోయారు.