కరోనా: మాంసాహారులను శిక్షించడానికి దిగొచ్చిన అవతారం

కరోనా: మాంసాహారులను శిక్షించడానికి దిగొచ్చిన అవతారం

కరోనా వైరస్‌.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది ఓ జంతువు నుంచి మనుషులకు సోకినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ఏ జంతువు నుంచి వచ్చిందన్న విషయంపై క్లారిటీ లేదు. మొదట్లో గబ్బిలాలు, పాముల నుంచి ఈ వైరస్ పుట్టినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అలుగు నుంచి మనుషులకు వచ్చిందని మరో కథనం వచ్చింది. శాస్త్రవేత్తలు మాత్రం దీని మూలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధ్రువీకరించలేకపోతున్నారు. అయితే జంతువుల నుంచే ఈ వైరస్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వెరైటీ కామెంట్స్ చేశారు. చైనీయుల నుంచి అమాయక మూగ జీవాలను కాపాడడానికి దిగొచ్చిన అవతారమే కరోనా అని ఆయన అభిప్రాయపడ్డారు. నాన్ వెజిటేరియన్స్‌ను శిక్షించడానికి వచ్చిందన్నారు.

కరోనా విగ్రహం పెట్టి పూజలు చేయండి

కరోనా అనేది వైరస్ కాదని, జంతువులను కాపాడడానికి వచ్చిన అవతారమని అన్నారు చక్రపాణి. జంతువులను చంపి తినే మాంసాహారులను అంతం చేసి, మానవాళికి ఓ సందేశం ఇవ్వడానికి వచ్చిందన్నారు. మూగ జీవాలను హింసిస్తున్నందుకు చైనీయులకు గుణపాఠం నేర్పుతోందని అన్నారాయన. జంతువులను చంపి తినడం మానేసి వెజిటేరియన్స్‌గా మారాలని చైనా వారికి సలహా ఇచ్చారు చక్రపాణి. అలాగే ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కూడా ఓ సలహా ఇచ్చారు. కరోనా విగ్రహ ప్రతిష్ఠ చేసి.. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రార్థించాలని చెప్పారు. భవిష్యత్తులో ఏ జంతువునూ హింసించబోమని చైనీయులంతా ప్రతిజ్ఞ చేస్తే కరోనా కోపం తగ్గుతుందన్నారు చక్రపాణి. విగ్రహం ఏర్పాటు చేసి పూజించి.. తాను చెప్పిన తీరుగా వింటే కరోనా తన అవతారం చాలించి, తన లోకానికి తిరిగి వెళ్లిపోతుందని చెప్పారాయన. దేవుడిని పూజిస్తూ, గో రక్షణను నమ్మే భారతీయులకు కరోనా సోకదని అన్నారు.