ఐపీఎల్ అంటే క్రేజ్ లేనిదెవరికి..? అది యూత్ అయినా సరే.. వృద్ధులైనా సరే.. చివరికి ప్రజా ప్రతినిధులైనా సరే. వీలైతే స్టేడియంకు వెళ్లి చూడటం లేదంటే టీవీలోనో.. మొబైల్ లోనో చూస్తూ రిలాక్స్ అవ్వటం. అయితే కర్ణాటక ఎమ్మెల్యేలకు ఫ్రీ టికెట్స్ ఇచ్చేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ KSCA ముందుకొచ్చింది. ప్రత్యేకంగా సీఎం సిద్ధరామయ్యను కలిసి ఫ్రీ టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పడం వైరల్ గా మారింది. మ్మెల్యేలకు ఫ్రీ టికెట్లేంటి.. ఆ మాత్రం కొనుక్కోలేరా..? అనుకుంటున్నారా? అయితే దీని వెనక పెద్ద తతంగమే జరిగింది. అదేంటో చదవండి.
2026 మార్చి 27, శుక్రవారం KSCA ప్రసిడెంట్, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. శనివారం జరగబోయే బెంగళూర్ (RCB) vs హైదరాబాద్ (SRH) మ్యాచ్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో VIP స్టేటస్ లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఒక రోజు ముందు అంటే గురువారం టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యేలకు ఈ ఆఫర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వటం లేదని.. సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడాలా ఏంటి అంటూ KSCA పై ఎమ్మెల్యేలు విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా సీఎంను కలిసి మ్యాచ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ విమర్శలకు దిగింది. ఇండియా తరఫున పాకిస్తాన్ టీమ్ కు చుక్కలు చూపించిన ఐకానిక్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.. చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏంటని ఆ పార్టీ నేత తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. ఏ తప్పు చేయకపోయినా.. ఎలాంటి ఫెయిల్యూర్ లేకపోయినా.. నాయకుల ఇగోల కారణంగా చేతులు కట్టుకోవాల్సి వచ్చిందని విమర్శించారు.
